మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఫోర్జరీ పత్రాలతో కల్యాణ లక్ష్మి డబ్బును కాజేయాలని చూసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. డోర్నకల్ మండల కేంద్రానికి చెందిన కొలిపాక విజయ్ ఓ పత్రికలో కంట్రిబ్యూటర్‌గా పని చేస్తూ కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు కల్యాణ లక్ష్మి పథకం కింద 1,00116 రూపాయలు ఇప్పిస్తానని, ఒక్కొక్కరి నుంచి 40 వేల రూపాయల ఒప్పందం చేసుకుని ఫోర్జరీ సంతకాలు చేసి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు.
'నకిలీ డాక్యుమెంట్లతో కల్యాణ లక్ష్మి నగదు కాజేసేందుకు ప్లాన్' - Telangana Kalyana Lakshmi scheme
నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో కల్యాణ లక్ష్మి నగదు కాజేయాలని చూసిన ఇద్దరు వ్యక్తులను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఫోర్జరీ పత్రాలు, నకిలీ స్టాంపులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.
డోర్నకల్ మండలంలోని ఐదుగురు అమ్మాయిలకు కల్యాణ లక్ష్మి పథకం నగదు ఇప్పిస్తానని.. ఆధార్ కార్డులు, నకిలీ స్టడీ సర్టిఫికెట్లు, నకిలీ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్లు తయారుచేసి అన్ని డాక్యుమెంట్ల పై గెజిటెడ్ అధికారుల సంతకం ఫోర్జరీ చేసి అప్లై చేశాడు. ఈ దరఖాస్తుల్లో ఐదు మైనర్ బాలికలవే ఉండటం గమనార్హం. షన్ను జీరాక్స్కు చెందిన షేక్ సాజిద్ అనే వ్యక్తి సాయంతో విజయ్ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసేవాడు. వీటికి సంబంధించిన స్టాంపులను ఖమ్మంలోని బుద్ధా రవి కుమార్ అనే వ్యక్తి దగ్గర తయారు చేయించేవాడు. స్థానికుల సమాచారంతో విజయ్, సాజిద్‌లను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.