భూముల రికార్డుల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు సర్కారు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లో తమ ఆస్తులు నమోదు చేయించుకుంటే రికార్డులు పారదర్శకంగా ఉంటాయనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అయితే కొందరు అక్రమార్కులు ఏకంగా ధరణి పేరిట నకిలీ యాప్ సృష్టించారు. ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యంతో ధరణి యాప్‌ను రూపొందించారు. దీన్ని అధికారిక వెబ్‌సైట్‌గా నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ విషయం రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ దృష్టికి రావడంతో... సంబంధిత అధికారులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్లేస్టోర్‌లో నకిలీ ధరణి యాప్.. ఇద్దరు అరెస్ట్ - ధరణి యాప్ వార్తలు
రాష్ట్రంలో భూముల రికార్డుల నిర్వాహణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ధరణి పోర్టల్ పేరిట నకిలీ యాప్ రూపొందించిన ఇద్దరు... సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు చిక్కారు. నకీలీ యాప్‌ను ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రెండు ఫోన్లు, లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు కర్ణాటక బసవకల్యాణంకు చెందిన ప్రేమ్ ముల్లే, మహేష్ కుమార్ కలిసి నకిలీ యాప్ రూపొందించారని విచారణలో బయటపడింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో నకిలీ యాప్‌ను రూపొందించినట్లు భావిస్తున్నారు. ఇంకా ఏమైనా యాప్‌లు రూపొందించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ధరణి పేరిట మరికొన్ని నకిలీ యాప్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు ఈ తరహా ధరణి పేరిట ఉన్న యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవద్దని పోలీసు అధికారులు కోరుతున్నారు. నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి :జీహెచ్ఎంసీ ఎన్నికలతో జోరందుకున్న మద్యం అమ్మకాలు