భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని పాతూరు, సంధిబందం గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి పెద్దపులి సంచారాన్ని గ్రామస్థులు, అటవీ అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లో కొమరం సత్యనారాయణ అనే రైతుకు సంబంధించిన దుక్కిటెద్దును పులి చంపి తిన్నట్లు ఆనవాళ్లు కనిపించాయి.
అలర్ట్: రెండు దశాబ్ధాల తర్వాత ఆ జిల్లాలో పులి గాండ్రింపులు - Tiger wandering in Allapalli is the latest news
సుమారు రెండు దశాబ్దాల తరువాత జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోకి పులి ప్రవేశించినట్లుగా అధికారులు పాదముద్రల ద్వారా నిర్ధారించారు. రాత్రి వేళ ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.
చింతగండి వాగు మీదుగా నడిచి వెళ్లినట్లు పంజా గుర్తులు కనిపించాయి. అవి పులివేనని నిపుణులు నిర్ధారించారు. అటవీ అధికారులు అక్కడి ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి జాడను కనుక్కునేందుకు అటవీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో పులి జాడ గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 20 ఏళ్లలో తొలిసారిగా పులి సంచరించిందని అధికారులు తెలిపారు. పశువులను బయట కట్టేయవద్దని... రాత్రి సమయంలో ప్రజలు ఎవరు బయటకు తిరగొద్దని సూచించారు. ఎవరికైనా పులి జాడ కనిపిస్తే.. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.