కలుషిత రొట్టెలు తిని ముగ్గురు మృతి... ఇద్దరి పరిస్థితి విషమం - సంగారెడ్డి జిల్లా వార్తలు
08:35 December 22
కలుషిత రొట్టెలు తిని ముగ్గురు మృతి... ఇద్దరి పరిస్థితి విషమం
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్‌వట్లలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పల్వట్లకు చెందిన శంకరమ్మ ఈ నెల 13న అస్వస్థకు గురై ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆమె దినకర్మకు కుటుంబసభ్యులు వచ్చారు. ఆమె వినియోగించిన పిండితో జొన్న రెట్టెలు చేసుకుని తిన్నారు. అనంతరం రొట్టెలు తిన్న 5గురు సభ్యులు వాంతులు చేసుకోగా కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు.
మృతులు చంద్రమౌళి, శ్రీశైలం, సుశీలమ్మగా... అనుసుయ, సరితలు చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి:అప్పుల బాధ తట్టుకోలేక స్వర్ణకారుడి ఆత్మహత్య