మహబూబాబాద్ జిల్లా ఎర్రకుంట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి జరగాల్సిన ఆ ఇంట ముగ్గురు మృతి చెందడంతో తండావాసుల రోదనలు మిన్నంటాయి. జాటోత్ కస్నా నాయక్, కల్యాణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె ప్రమీల వివాహం... డోర్నకల్ మండలానికి చెందిన యువకుడితో నిశ్చయమైంది. ఫిబ్రవరి 10న ప్రమీల పెళ్లికి ముహుర్తం ఖరారు చేశారు.
పన్నెండు రోజుల్లో పెళ్లి.. తండ్రీ కొడుకులే మిగిలారు.! - తెలంగాణ వార్తలు
మరో పన్నెండు రోజుల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కూతురి పెళ్లి కోసం చీరలు, నగలు కొందామని బంధువులతో కలిసి బయల్దేరిన 20 నిమిషాల్లోనే వారిని మృత్యువు కబళించింది. నగలు కొనుక్కొని వస్తామన్న వాళ్లు అనంత లోకాలను చేరారు. ఒకే సారి భార్య, కూతురు, కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. పెళ్లి జరగాల్సిన ఆ ఇంట ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో తండాలో రోదనలు మిన్నంటాయి.
పెళ్లి కోసం బట్టలు, బంగారం కొనడానికి తండాకు చెందిన రాము అనే వ్యక్తి ఆటోను తీసుకొని శుక్రవారం ఉదయం వధువు ప్రమీల, పెళ్లి కూతురు తల్లి కల్యాణి, పెళ్లికూతురు అన్న ప్రదీప్, పెళ్లి కూతురు చిన్నమ్మ, బాబాయ్ ప్రసాద్, లక్ష్మీలు కలిసి ఆటోలో వరంగల్‌కు బయలుదేరారు. ఇంటి నుంచి బయలుదేరిన 20 నిమిషాలకే లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి కూతురు తండ్రి కస్నా నాయక్ గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు, మరో కుటుంబంలో ఇద్దరు, మరో కుటుంబంలో ఒకరు మృత్యువాత పడ్డారు.
ఇదీ చదవండి:మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి