కుమురం భీం ఆసిఫాభాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో ప్రాణహిత నదిలో దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకోగా.. భార్య, కుమార్తె మరణవార్త విని మనస్తాపంతో తండ్రి బావిలో దూకి బలవన్మరణం చేసుకున్నాడు.
బూరెపల్లికి చెందిన నక్క రాజుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. స్థానికంగానే ఉంటూ వ్యవసాయ కూలీలుగా వారు జీవనం సాగించేవారు. గురువారం సాయంత్రం ఇంట్లో తగాదా జరుగగా.. భార్య చిన్న కూతురిని తీసుకుని మహారాష్ట్రలోని తల్లిగారింటికి వెళ్తానని బయలు దేరిందని స్థానికులు తెలిపారు.
శుక్రవారం ఉదయం సమీపంలోని ప్రాణహిత నదిలో రెండు మృతదేహాలు కనిపించగా.. నక్కరాజు భార్య కూతురుగా గుర్తించారు. ఈ విషయం రాజుకు తెలియడం వల్ల మనస్థాపానికి గురై.. సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యలకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అసలు తల్లి, కుమార్తె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు మరణించడం పట్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి :చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం