తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మాటు వేస్తున్నారు.. సందు చూసి సర్దుకుపోతున్నారు! - హైదరాబాద్​ క్రైమ్​ వార్తలు

ఓ పక్క కరోనా ప్రభావంతో జనాలంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. మరోపక్క దొంగలు అందిన కాడికి దోచుకుంటున్నారు. లాక్​డౌన్ విధించిన సమయంలో నేరాలు కాస్త తగ్గుముఖం పట్టినా... సడలింపు చేసినప్పటి నుంచి నగరంలో చోరీలు, దోపిడీలు పెరిగిపోయాయి. ఇళ్ళలోకి చొరబడి విలువైన వస్తువులు, పార్కింగ్​ చేసిన వాహనాలు తస్కరిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టినప్పటికీ.. వారి కళ్లు గప్పి దొంగలు వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు.

Theft cases increased in unlock lockdown In hyderabad
సందు చూసి.. సర్దుకుపోతున్నారు!

By

Published : Sep 11, 2020, 10:43 AM IST

కరోనా ప్రభావంతో నగరంలో 60శాతం నేరాలు తగ్గాయని పోలీసులు చెప్తున్నా.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. లాక్​డౌన్​ సడలింపు తర్వాత చోరీల సంఖ్య పెరిగింది. గత నెల రోజలు వ్యవధిలోనే నగరంలో పదుల సంఖ్యలో దొంగతనాలు జరిగాయి. లాక్​డౌన్ సమయంలో చెక్​పోస్ట్ విధుల నుంటి పోలీసులు మళ్లీ సాధారణ విధుల్లో నిమగ్నమయ్యారు. అన్ని ప్రాంతాల్లో గస్తీ కూడా పెంచారు. అయినా పోలీసులు కళ్ళు గప్పి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. కేవలం ఇళ్ళలో మాత్రమే కాదు.. కార్లు, ద్విచక్ర వాహనాలు, చివరికి దేవాలయాల హుండీలను కూడా వదలకుండా దోచేశారు.

ఆగష్టు 9న గోల్కొండ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బాల్​రెడ్డి నగర్​లో ఒక ఇంట్లో చోరీ చేసిన దొంగలు కోటి 30 లక్షల నగదు ఎత్తుకెళ్ళారు. యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు దొంగలను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆగష్టు 10న ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో దొంగలు చోరికి విఫలయత్నం చేశారు. ఆలయ కాపలాదారుడిపై కత్తులతో దాడి చేసి అతడిని గదిలో నిర్బంధించి అక్కడి నుంచి పరారయ్యారు. గత నెల 12న ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న ఐదుగురు దొంగలను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ పరిధిలోని వివిధ కాలనీలతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో బైకులను దొంగతనం చేసిట్లుగా గుర్తించారు. వాహన తనిఖీల్లో ఈ ముఠా పోలీసులకు చిక్కింది వీరిలో ఇద్దరు మైనర్లున్నారు. అదే రోజు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి కొందరు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. ఏటీఎం మిషన్​ని పూర్తిగా ధ్వంసం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. క్లూస్ టీమ్, సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆగష్టు 17న హైదరాబాద్ పాతబస్తీలోని కందికల్ గేట్ వద్ద ఉన్న చిత్రగుప్త ఆలయంలోని 5 హుండీలు పగలగొట్టి అందులోని సొమ్ము ఎత్తుకెళ్లారు. దాదాపు రూ. 80 వేలు దొంగతనానికి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గతనెల 19న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలక్ట్రానిక్ గోడౌన్లలో చొరబడిన దుండగులు లాప్​టాప్​లను ఎత్తుకెళ్ళారు. ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడైన ఇర్ఫాన్ బీదర్ జైలు నుంచి ప్రణాళిక రచించాడని పోలీసులు వివరించారు. నిందితుల నుంచి రూ.15 లక్షలు విలువ చేసే 22 ల్యాప్ టాప్​లు, దొంగతనాలకు ఉపయోగించిన ఐరన్ రాడ్,ఒక ఎక్స్​యూవీ 500 వాహనం స్వాధీనం చేసుకున్నారు. అదే రోజున నగరంలోని పలు ఏటీఎంల వద్ద నిలబడి నకిలీ ఏటీఎం కార్డులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చి డబ్బులు డ్రా చేయడానికి సాయం కోరిన వారిని మాయమాటల్లో పెట్టి వీరి వద్ద కార్డు తీసుకుని నకిలీ కార్డులు బాధితులకు ఇచ్చి అనంతరం డబ్బులు కాజేస్తున్న దొంగలు సాత్విక్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్​కి తరలించారు. వీరిద్దరూ ఇప్పటివరకూ 37 ఏటీఎంల వద్ద ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 2.97లక్షల నగదు, ఓ ద్విచక్రవాహనం, 41 నకిలీ ఏటీఎం కార్డులు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

ఆగష్టు 20న ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న గొల్ల సంతోష్ అనే వ్యక్తిని కూకట్​పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి విలువైన కంప్యూటర్లతో పాటు, టీవీలు, మూడు ద్విచక్ర వాహనాలు, కిలో వెండి, ఒక కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఆగష్టు 24న తాళాలు వేసి ఉన్న హాస్టల్ తాళాలు పగలగొట్టి టీవీలను దొంగిలిస్తున్న ఇద్దరిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. 1.50లక్షల విలువచేసే 13 టీవీలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అదే రోజున వాహనాలను దొంగలిస్తున్న భార్యాభర్తలను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఇన్నోవా కారుతో పాటు, 1ద్విచక్ర వాహనం, 3 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆగష్టు 25న హయత్ నగర్​లోని గజ్జి స్వామియాదవ్ కాలనీలో మిట్ట మధ్యాహ్నం దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసి బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్ళారు. యజమానులు బయటికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా సెప్టెంబర్ 2న కేపీహెచ్​బీ పోలీస్టేషన్ పరిధిలోని ఫేస్-3లో భారీ చోరీ జరిగింది. రెండు ఇళ్ళకు వేసి ఉన్న తాళాలు పగలకొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు యాభై తులాల బంగారం, కేజీ వెండి ఎత్తుకెళ్ళినట్లు భాదితులు తెలిపారు. సెప్టెంబర్​ 4న చెడు వ్యసనాలకు బానిసై తాళం వేసిన ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్నా ఒడిస్సాకు చెందిన కొల్లి ఉమాశంకర్​ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 12.5.తులాల బంగారం, 40తులాల వెండి, 3.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఐఐసీటీ కాలనీ అధ్యక్షుడు బీపీ చారి ఇంటికి అద్దె ఇల్లు కోసం వచ్చి ఒంటరిగా ఉన్న మహిళకు మత్తు మందు ఇచ్చి మెడలోని మంగళ సూత్రం, చెవి కమ్మలు లాక్కెళ్లాడు ఓ ఘరాానా దొంగ. ఈకేసులో మేడిపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మహిళ ఆరోగ్య పరిస్థితి బాగలేక పోవడం వల్ల స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

సెప్టెంబర్​ 5న ఎస్​ఆర్​ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో కొందరు చోరీకి పాల్పడ్డారు. సుమారుగా 5 తులాల బంగారం, అరకేజీకి పైగా వెండి చోరీకి గురయినట్లుగా గుర్తించారు. ఈ నెల 7న రాత్రుళ్లు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.అతని నుంచి రూ. 16.70 లక్షల విలువ చేసే 39గ్రాముల బంగారం, 829గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. మరో 60తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. నిందితుడు ఆవుల కిరణ్‌ని సీసీ టీవీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మరో కేసులో శివారు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 325గ్రాముల బంగారం, కిలో వెండి, 6లక్షల 70వేల రూపాయలు నగదు, ఒక ద్విచక్ర వాహానాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ నిందితులిద్దరూ గుల్బర్గాకు చెందిన షేక్ సాబేర్‌, పఠాన్ చాంద్‌పాషాలని సీపీ స్పష్టం చేశారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాలనీల్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులపట్ల ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

ఇదీ చదవండి:'రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదు'

ABOUT THE AUTHOR

...view details