ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరా రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవల పోలీసుల తనిఖీల్లో చాలా కేసులు వెలుగుచూశాయి. గంజాయి ముఠాలు యువకులతో సరఫరా చేయిస్తున్నట్లు తేల్చారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని అశ్వారావుపేట వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. దిల్లీకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో... ఖమ్మానికి చెందిన ఓ యువకుడిని పరిచయం చేసుకున్నాడు. బెయిల్ ఇప్పిస్తామని చెప్పి గంజాయి రవాణా ఊబిలోకి దించాడు. అక్రమంగా సరుకు తరలించే సమయంలో యువకుడు మరోసారి జైలు పాలయ్యాడు. అతడిని బయటకు తీసుకువచ్చే క్రమంలో యువకుడి సోదరుడు సైతం సరఫరాదారునిగా మారటం అధికారులను విస్మయానికి గురిచేసింది.
భద్రాచలం నుంచి అక్రమంగా
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో కొన్ని నెలల క్రితం అనుమానాస్పదంగా వెళుతున్న ఆటోను ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. భద్రాచలం నుంచి అక్రమంగా తరలిస్తున్న 2 క్వింటాళ్ల గంజాయి దొరకగా.... నలుగురు యువకులు పట్టుబడ్డారు. గంజాయి సరఫరా ఎందుకు చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా..... చెప్పిన చోటుకి సరుకు చేరవేస్తే రూ.లక్ష ఇస్తామని మధ్యవర్తులు చెప్పడంతో డబ్బులకు ఆశపడినట్లు వెల్లడించారు.