కుమురం భీం జిల్లా దహేగాం మండలం దిగిడ ఆటవీప్రాంతంలో గతనెల 11న పశువులను మేపడానికి వెళ్లిన విగ్నేష్ పులి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ దారుణ ఘటన మారువకముందే 20 రోజుల అనంతరం మరొకరు బలయ్యారు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల అనే బాలిక పత్తి చేనులో పనిచేస్తుండగా.. మాటువేసి దాడిచేసి నోటకరుచుకుని వెళ్ళింది. ఆమె కేకలు వేయగా చుట్టుపక్కలవాళ్లు అప్రమత్తమై పులిని తరిమేశారు. అప్పటికే నిర్మల ప్రాణాలొదిలింది. గత కొన్నేళ్లుగా బెజ్జూరు, దహేగాం, పెంచికలపేట అటవీప్రాంతంలో పులులు సంచరిస్తూ.. అడపాదడపా కనిపించడం పశువులపై దాడి చేయడం పరిపాటిగా మారింది. ఒకే నెలలో ఇద్దరు మనుషులను చంపడం స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
చిక్కని పులి జాడ
మహారాష్ట్ర నుంచి పులి వచ్చిందని చెబుతున్న అధికారులు.. దాన్ని బందించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడి చేసిన సమీప ప్రాంతంలో బోన్లు, కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి జాడ మాత్రం ఇంకా చిక్కలేదు. పెంచికలపేట అటవీప్రాంతం వైపు పయనించిందని పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు... మహారాష్ట్ర వైపే వెళ్లిందనే నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత కూడా పులి కదలికలు కనిపించినా అవి కాగజ్నగర్ డివిజన్ పరిధిలోనివి అని అధికారులు చెప్తున్నారు.