గిరిజన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత హత్య చేసిన ఘటనకు సంబంధించిన మిస్టరీ నాలుగు నెలల తర్వాత వీడింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అంబ్రియా తండా అనుబంధ గ్రామం సోమ్లా తండాకు చెందిన యువతి ఖోలా శిరీష (18) టేక్మాల్ మండలం ఎల్లుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవరు కుమ్మరి వీరేశం ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆటోలో పాఠశాలకు రోజూ తీసుకొచ్చి తిరిగి ఇంటికి చేర్చేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి గతేడాది సెప్టెంబరు 13న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. గచ్చిబౌలిలో ఓ గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. సదరు యువతి పెళ్లి చేసుకోమని అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది.
నది చూద్దామని నమ్మబలికి..
వీరేశం మొదటి భార్య అప్పటికే గుండెపోటుతో ఐదేళ్ల క్రితం చనిపోవడంతో న్యాల్‌కల్ మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. శిరీషను ఎలాగైనా వదిలించుకోవాలనే దురుద్దేశంతో మీ అమ్మానాన్నలతో మాట్లాడిన తర్వాత వివాహం చేసుకుందామని చెప్పి ఆమెతో కలిసి ఆటోలో అక్టోబరు 18న ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఎన్కెపల్లి గ్రామ శివారులోని మంజీర వంతెనపై ఆటో ఆపి నీటిని చూద్దామని నమ్మబలికాడు. ఆతర్వాత కిందికి దించి నది దగ్గరికి తీసుకెళ్లి అందులో తోసేశాడు.