ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన జోగు అపర్ణను ఆనందపురం మండలం భీమన్నదొరపాలెం గ్రామానికి చెందిన జోగు గంగునాయుడు ప్రేమించి 2016 ఆగస్టులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏడాది తర్వాత అపర్ణ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి భర్త, అత్తింటి వాళ్లు అపర్ణను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లైన తర్వాత అపర్ణ కొంతకాలం అత్తమామలతో కలసి ఉంది. ఆ తర్వాత విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి వీరు మకాం మార్చారు.
ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యపై భర్త హత్యాయత్నం
ఆడపిల్లకు జన్మనిచ్చిందని కట్టుకున్న భార్యనే రహస్యంగా కడతేర్చాలని ప్రయత్నించాడో భర్త. భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇష్టం వచ్చినట్టు కొట్టి.... అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు మంచినీళ్ల బాటిల్లో యాసిడ్ కలిపి తాగించాడు. ఈ సంఘటన ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది.
ఈ ఏడాది ఏప్రిల్ 20, 2020న గంగునాయుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న అపర్ణను చిత్రహింసలకు గురిచేసి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా కొట్టాడు. ఆ తర్వాత ఆమెకు మంచి నీళ్ల బాటిల్లో యాసిడ్ కలిపి తాగించాడు. అపర్ణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు ఆమెను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే బిడ్డను చంపేస్తానని గంగునాయుడు భార్యను బెదిరించాడు. అపర్ణ గత 8 నెలలుగా విషయాన్ని తల్లిదండ్రుల వద్ద దాచిపెట్టిoది. చివరకు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భర్త చేసిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అపర్ణ తల్లిదండ్రులు విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు ఈ నెల 4న ఫిర్యాదు చేశారు. భర్త గంగునాయుడును అదుపులో తీసుకొని...పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి