తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'బాధ్యత కాదంటే కుదరదు...కొత్త ఎల్​ఈడీ టీవీ ఇవ్వాల్సిందే' - రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం

బజాజ్ ఎలక్ట్రానిక్స్​లో ఓ వ్యక్తి ఎల్ఈడీ టీవీ కొనుగోలు చేశారు. మూడేళ్ల వారంటీ ఉన్న టీవీ ఏడాదికే పాడయింది. టీవీ తయారు చేసిన పీఈ ఎలక్ట్రానిక్స్ మరమ్మతు చేసింది. కొన్నాళ్లకే మళ్లీ పాడయింది. తిరిగి పీఈ ఎలక్ట్రానిక్స్​ను సంప్రదిస్తే... వారు స్పందించలేదు. అమ్మడం వరకే తన బాధ్యత.. మరమ్మతులతో తమకు సంబంధం లేదని బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేర్కొంది. కొనుగోలుదారుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఫోరం ఏం చెప్పింది... బాధ్యత ఎవరికీ లేదా.. చివరకు వినియోగదారుడికి న్యాయం జరిగిందా అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

rangareddy district latest news
rangareddy district latest news

By

Published : May 31, 2020, 6:30 AM IST

హైదరాబాద్​లోని మన్సురాబాద్​కు చెందిన బి.సత్యనారాయణ వనస్థలిపురంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్​లో 2016 జూన్ 19న.. రూ.47,990తో ఫిలిప్స్ ఎల్ఈడీ టీవీ కొనుగోలు చేశారు. టీవీకి మూడేళ్ల వారంటీ ఉంటుందని షోం రూం నిర్వాహకులు చెప్పారు. అయితే సరిగ్గా ఏడాదికి 2017 జూన్ 18న టీవీ ఆగిపోయింది. బజాజ్ షోరూంకు వెళ్లి ఫిర్యాదు చేశారు.

తమకు సంబంధం లేదు...

షోం రూం సిబ్బంది సూచనలతో టీవీని తయారు చేసిన పీఈ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​ను సంప్రదించారు. పీఈ ఎలక్ట్రానిక్స్ సర్వీస్ టెక్నీషియన్ వచ్చి టీవీ రిపేర్ చేశారు. మళ్లీ సరిగ్గా ఏడాదికి 2018 జూన్ 29న పాడయింది. సత్యనారాయణ బజాజ్ షోరూంకు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశారు. పీఈ ఎలక్ట్రానిక్స్​తో ప్రస్తుతం వ్యాపార సంబంధాలు లేవన్నారు. డీలర్ షిప్ లేనందున.. తమకు సంబంధం లేదని బజాజ్ షోరూం నిర్వాహకులు తెలిపారు.

వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు...

నేరుగా పీఈ ఎలక్ట్రానిక్స్​ను సంప్రదిస్తే.. వారు స్పందించలేదని సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో టీవీ కోసం తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బజాజ్ షోరూం, పీఈ ఎలక్ట్రానిక్స్​కు లీగల్ నోటీసు పంపించారు. చివరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

విక్రయం వరకే తమ బాధ్యత...

ఫిలిప్స్ ఉత్పత్తుల విక్రయం వరకే తమ బాధ్యత అని.. మరమ్మతులతో సంబంధం లేదని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాదించింది. ఫిలిప్స్​తో పాటు అనేక బ్రాండ్లు అమ్ముతామని.. తయారీ లోపాలకు తమ బాధ్యత కాదని పేర్కొంది. ఒకసారి అమ్మిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోమని తెలిపింది. గ్యారంటీ బాధ్యత తయారీ సంస్థదేనని రశీదులోనే పేర్కొన్నందున.. సత్యనారాయణ ఫిర్యాదు విచారణార్హమే కాదని వాదించింది.

ముప్పై రోజుల్లో తీర్పు అమలు చేయాలి...

మరోవైపు పీఈ ఎలక్ట్రానిక్స్​కు వినియోగదారుల ఫోరం నోటీసులు ఇచ్చినప్పటికీ.. స్పందించలేదు. వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం.. బజాజ్, పీఈ ఎలక్ట్రానిక్స్ రెండు సంస్థలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. సత్యనారాయణకు చెడిపోయిన ఫిలిప్స్ ఎల్ఈడీ టీవీ స్థానంలో కొత్తది ఇవ్వాలని.. లేనిపక్షంలో ఆయన చెల్లించిన 47,990 రూపాయలు తిరిగి చెల్లించాలని తీర్పు వెల్లడించింది. ముప్పై రోజుల్లో తీర్పు అమలు చేయకపోతే.. మరో 5వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఫోరం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details