తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆ హత్యాయత్నం.. తెనాలి గ్యాంగ్ పనేనట! - విజయవాడ వ్యాపారిపై హత్యాయత్నం

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ వ్యాపారిపై జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారిపై హత్యాయత్నం తెనాలి గ్యాంగ్ దురాగతమని పోలీసులు నిర్ధరించారు. ‌ విజయవాడ వ్యాపారి సురేష్‌ను హతమార్చేందుకు తెనాలి గ్యాంగ్ రెండ్రోజుల క్రితం ప్రయత్నించింది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సురేష్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు విచారణలో నిర్ధరణ అయ్యింది. నిందితులు సుఫారి తీసుకుని సురేష్‌పై హత్యాయత్నం చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

ఆ హత్యాయత్నం..తెనాలి గ్యాంగ్ పనే...!
ఆ హత్యాయత్నం..తెనాలి గ్యాంగ్ పనే...!

By

Published : Dec 10, 2020, 1:05 PM IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం 24 గంటల వ్యవధిలోనే హత్యాయత్నం కేసును ఏపీలోని గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు ఛేదించింది. రెండు రోజుల కిందట తాడేపల్లి స్టేషన్‌ పరిధిలో విజయవాడకు చెందిన సురేష్‌ అనే వ్యాపారిని ఎర్రచందనం మొక్కలు కావాలని నమ్మకంగా పిలిపించి అతన్ని తీవ్రంగా గాయపరిచింది తెనాలికి చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. బాధితుడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌, బంగారం వస్తువులను ఆ ముఠా అపహరించుకుపోయింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తునకు ఆదేశించారు.

బ్లేడు బ్యాచ్‌ ఆగడాలకు పేరుగడించిన విజయవాడ గ్యాంగ్‌లు ఏమైనా తాడేపల్లికి వచ్చి ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈకేసులో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. సురేష్‌ ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి తరచూ ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో ఆమె ఎలాగైనా తగిన శాస్తి చేయాలని నిర్ణయించుకుంది. తనకు తెలిసిన వారి ద్వారా తెనాలికి చెందిన ఓ కిరాయి ముఠాకు సుఫారీ ఇచ్చి సురేష్‌పై దాడికి పురమాయించింది. సుపారీ తీసుకున్న ఐదుగురు యువకులతో కూడిన గ్యాంగ్‌ సురేష్‌ను గాయపరిచి పరారయింది. ఎవరైనా శత్రువులు ఉన్నారా అని సురేష్‌ను పోలీసులు విచారించగా ఎవరూ లేరని చెప్పటంతో పోలీసులకు పాలుపోలేదు. గాయపరచటానికి ముందుకు ఆయన్ని విజయవాడ నుంచి వడ్డేశ్వరం-ఇప్పటం గ్రామాల మధ్యకు ఎవరు పిలిపించారో కూడా బాధితుడికి తెలియని పరిస్థితి. వారి చరవాణి నంబర్లు గుర్తులేవని బాధితుడు చెప్పటంతో ఎస్పీ ఈ కేసులో సాంకేతికతను వినియోగించి ముందుకెళ్లాలని అప్పటికప్పుడు ఐటీకోర్‌ సిబ్బందిని పిలిపించారు.

కేసులో ముందడుగు పడిందిలా..

బాధితుడి ఫోన్‌ కాల్‌లిస్టు తీశారు. అతను గాయపడటానికి ముందు చివరి ఫోన్‌కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో సెల్‌టవర్‌ లొకేషన్ల వారీగా కొన్ని వేల ఫోన్లను విశ్లేషించగా అందులో తెనాలి గ్యాంగ్‌కు చెందిన యువకుడి చరవాణి నుంచి ఫోన్‌ వచ్చినట్లు తెలుసుకున్నారు. వెంటనే తాడేపల్లి ఇన్‌స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, అంకమ్మరావు బృందాలను తెనాలికి పంపారు. తెనాలి నాజర్‌పేటలో ఆ యువకుడు ఉంటున్నట్లు తెలుసుకుని నేరుగా పోలీసులు ఆ ప్రాంతానికి బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకోవటంతో కేసు చిక్కుముడి వీడింది. ఆ యువకుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని విచారించగా సుపారీ తీసుకుని గాయపరిచామని అంగీకరించారు. గురువారం నాటికి కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రా ప్యారిస్‌లో...

ఇటీవల మూడు రోజుల కిందట తెనాలి బస్టాండ్‌ ఎదురుగా ఓ వ్యక్తి బస్సు దిగొస్తుండగా అతన్ని బ్లేడ్‌లతో గాయపరిచి అతని వద్ద ఉన్న రూ.25 వేలు తీసుకుని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్ధానికంగా ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలు సేకరించి విశ్లేషించగా అందులో బ్లేడ్‌బ్యాచ్‌కు చెందిన ఓ యువకుడి ఆచూకీ లభ్యం కావటంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను నేరం అంగీకరించటంతో ఆ కేసు కొలిక్కి వచ్చింది. మొత్తానికి బ్లేడులతో తెగబడటం ప్రస్తుతం తాడేపల్లి, తెనాలి, గుంటూరు ప్రాంతాలకు పాకటంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. నిర్జీవ ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దని బస్సు, రైల్వేస్టేషన్లకు వెళ్లే దారుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఇదీ చదవండి :అమెరికా నుంచి ఫోన్​లో ట్రిపుల్ తలాక్...

ABOUT THE AUTHOR

...view details