"ఆడుకుని వస్తానమ్మా..." అంటూ ఇంట్లోంచి వెళ్లిన ఒక్కగానొక్క కూతురు... చెరువులో విగతజీవిగా తేలడం... నేరేడ్‌మెట్‌లోని అభిజిత్ కపూరియా దంపతులకు గర్భశోకాన్ని మిగిల్చింది. పంజాబ్‌కి చెందిన అబిజిత్ కపూరియా కుటుంబం 2007లో నగరానికి వచ్చారు. అభిజిత్ దంపతులకు 12ఏళ్ళ సుమేద ఒక్కతే కూతురు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గతంలో మల్కాజిగిరిలోని వేరే ప్రాంతంలో అద్దెకు ఉన్న కుటుంబం... రెండు నెలల క్రితమే దీన్ దయాల్ నగర్‌కు వచ్చారు.
రోజూ లాగానే ఆన్‌లైన్ తరగతి పూర్తవగానే తన తల్లికి చెప్పి సైకిల్ తీసుకుని సుమేధ బయటకు వెళ్లింది. పక్కింట్లో తన స్నేహితురాలిని పలకరించింది. ఆ తర్వాత ఎంతకూ తిరిగి రాకపోవటం వల్ల అంతటా తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎక్కడా కన్పించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తెరిచిఉంచిన నాలానే బాలిక ప్రాణాన్ని బలితీసుకుందని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
చేయి కూడా చేసుకోలేదు...
"కేవలం కొంతమంది నిర్లక్ష్యం వల్ల చిన్నపాప ఎంతో బాధను అనుభవిస్తూ చనిపోవాల్సివచ్చింది. నేనెప్పుడూ కనీసం చేయి కూడా చేసుకోలేదు . అలాంటిది ఎంతో నొప్పిని భరిస్తూ ప్రాణం వదిలింది. ప్రమాదవశాత్తే జరిగి ఉండొచ్చు. కానీ.. అందుకు కారణమేంటి?. ఈ తరహా ప్రమాదాలేం కొత్తవి కావు ఏటా జరుగుతూనే ఉంటాయి. కొంతమంది బతుకుతారు నా బిడ్డ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది" అంటూ సుమేధ తండ్రి చేసిన వ్యాఖ్యలు స్థానికులను కంటతడి పెట్టించాయి.