జీవితంలో స్థిరపడేందుకు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. కష్టాలెన్నో భరించారు. అవమానాలెన్నో సహించారు. పిల్లల్లోనే సంతోషాన్ని వెతుక్కున్నారు. అందరినీ ఆశించిన దానికంటే మెరుగ్గానే సెటిల్ చేశారు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే వృద్ధాప్యమే మిగిలింది. కొడుకులిద్దరూ కళ్ల ముందే ఉంటున్నా.. వారు వేరుగానే బతకాల్సి వచ్చింది. ఆ వేదన భరించలేనంత భారమైంది!. ఆ కన్నీటి వ్యథను మోయలేక వృద్ధజంట భువి నుంచే నిష్క్రమించింది.
హృదయ విదారకం: విషపు ద్రావణం తాగి వృద్ధజంట బలవన్మరణం - వైరాలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
10:05 August 20
హృదయ విదారకం: విషపు ద్రావణం తాగి వృద్ధజంట బలవన్మరణం
ఆశలన్నీ మూటగట్టి.. రెక్కల కష్టాన్నంతా పోగుచేసి... పిల్లలను అల్లారుముద్దుగా సాకారు. చివరికి ఎవరికీ కాకుండా ఈ లోకాన్ని వదిలేశారు. వృద్ధ దంపతుల బలవన్మరణం అందరినీ కలచివేస్తోంది. ఖమ్మం జిల్లా వైరాలోని సంత బజారులో జగన్నాథచారి(80), వెంకట్రావమ్మ(70) జీవిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.
బంగారు పనిచేసి...
జగన్నాథచారి బంగారు పని చేసి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఇద్దరు అమ్మాయిలకు తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. కొడుకులకూ ఘనంగా వివాహం జరిపించాడు. కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక సంతోషంగా ఉండొచ్చని ఆ వృద్ధ దంపతులిద్దరూ ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఓ కొడుకు మధిరలో, మరో కొడుకు వైరాలో ఉంటున్నారు. తల్లిదండ్రులు మాత్రం వైరాలోనే వేరే ఇంట్లో జీవిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు ఇంతలోనే విషపు ద్రావణం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణమని తెలుస్తోంది.
ఇదీ చూడండి :ప్రమాదం: రోడ్డు దాటుతుండగా... డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి