బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసును ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవరాజ్ రెడ్డిని పోలీసులు మూడో రోజూ విచారిస్తున్నారు. మరో అనుమనితుడిగా ఉన్న సాయి కృష్ణారెడ్డిని ఆదివారం ఉదయం విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సాయికృష్ణా రెడ్డికి పోలీసులు నోటీసులు పంపినప్పటికీ శ్రావణి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్నందున తర్వాత వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.
శ్రావణిపై చేయి చేసుకోవడం
దేవరాజ్ సమర్పించిన ఫోన్ కాల్ రికార్డులతోపాటు అతడు పోలీసు విచారణలో చెప్పిన పలు విషయాలు ఆధారంగా సాయి కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆత్మహత్యకు ముందు శ్రావణి దేవరాజ్‌కు ఫోన్ చేయడం వల్ల ఆ సంభాషణకు సంబంధించిన ఆధారాలను కూడా అతడు పోలీసులకు అందజేశాడు. దీంతో ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణిని కుటుంబ సభ్యులు, సాయి దూషించడంతోపాటు ఆమెపై కుటుంబ సభ్యులు చేయి చేసుకున్నట్టుగా ఫోన్ రికార్డులో ఉంది. ఆ సమయంలో శ్రావణి దేవరాజ్‌కు ఫోన్ చేసి అలాగే ఉంచడం వల్ల వారి మధ్య వాగ్వాదం.. దూషణలు.. సోదరుడు శ్రావణిపై చేయి చేసుకోవడం అన్నీ రికార్డయ్యాయి. వీటిని పోలీసులకు దేవరాజ్ అందజేయడం వల్ల కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అలాగే, ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి-దేవరాజ్ ఓ రెస్టారెంట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న సాయి అక్కడికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగిన వీడియో ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలు సేకరించిన పోలీసులు అసలు ఆత్మహత్యకు దారితీసిన ప్రధాన కారణాలేమిటనే దానిపై ముఖ్యంగా విశ్లేషిస్తున్నారు.