కానుక అన్నాడు..రూ.వేలల్లో కాజేశాడు
గాంధీనగర్‌కు చెందిన యువతికి ఓ మ్యాట్రిమోనిలో వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఎన్‌ఆర్‌ఐనని, స్నేహానికి గుర్తుగా విలువైన బహుమతిని పంపిస్తున్నానంటూ నమ్మించాడు. మరుసటి రోజు దిల్లీ విమానాశ్రయం నుంచి ‘మీకు బహుమతి వచ్చింది. ఎక్సైజ్ పన్ను, డెలివరీ ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. దాంతో ఆ యువతి రూ.28 వేలను ఆన్‌లైన్ ద్వారా సదరు వ్యక్తి చెప్పిన ఖాతాకు పంపింది. ఆ తర్వాత మరో రూ.78 వేలు పంపించాలని చెప్పడంతో అప్రమత్తమై తనకు ఆ బహుమతి అక్కర్లేదని, తాను పంపిన డబ్బులు ఇచ్చేయాలని కోరడంతో అటునుంచి స్పందించడం మానేశాడు. హైదరాబాద్ సైబర్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. సైదాబాద్‌కు చెందిన వెంకటేష్ కూడా ఇదే తరహా మోసానికి గురయ్యాడు. కారు బహుమతి పేరిట రూ.80 వేలను నేరస్థులు స్వాహాచేశారు.
రూ.లక్ష కొట్టేశాడు..
నగరానికి చెందిన నవీన్‌కుమార్ సెకండ్ హ్యాండ్‌లో ఓ వాషింగ్ మిషన్ కొందామనుకున్నాడు.. ఓ వెబ్‌సైట్‌లో యంత్రాన్ని ఎంచుకుని అక్కడ ఉన్న నంబర్‌కు ఫోన్ చేశారు. ఎదుటి వ్యక్తి తాను సైన్యంలో పని చేస్తున్నానని, హైదరాబాద్ బదిలీ అవుతున్నందున అమ్ముతున్నానంటూ నమ్మించాడు. ‘క్యూఆర్ కోడ్ పంపిస్తా..స్కాన్ చేయండి’ అని చెప్పగానే నవీన్ అలానే చేయడంతో ఖాతాలోంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి.
ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం
పాతబస్తీకి చెందిన యూసుఫ్ ఉద్యోగ వేటలో ఉన్నారు. అంతర్జాలంలో వివిధ కంపెనీలు, ఇతర సంస్థల సైట్‌లలో అన్వేషించాడు. ఒక కంపెనీలో ఉద్యోగం ఉందని తెలుసుకుని దరఖాస్తు చేశాడు. మరుసటి రోజు ఫోన్ వచ్చింది. మీ దరఖాస్తును పరిశీలించాం. ప్రాసెసింగ్, ఇతర అవసరాల కోసం రూ.53 వేలు కావాలనడంతో ఆన్‌లైన్‌లో పంపించాడు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదే తరహాలో అంబర్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు కూడా రూ.40 వేలు పోగొట్టుకున్నాడు.