హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్ బీకే గూడ ప్రాంతంలో మత్తుమందులు విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 46 గ్రాములు ఎక్సటాసి పిల్స్, రెండు గ్రాములు ఎండీఎంఎ, 10 గ్రాములు చరాస్, ఒక కారు, ఒక మోటారు బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏఈఎస్ అంజిరెడ్డి నేతృత్వంలో అమీర్‌పేట్ బీకేగూడ ప్రాంతంలో నిందితుల స్థావరాలపై దాడులు నిర్వహించారు. మత్తుమందులు విక్రయాలు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఈఎస్ తెలిపారు. అరెస్టైన వారిలో ప్రైవేటు ఉద్యోగి పిల్లి మనోజ్‌కుమార్ మత్తుమందులకు వ్యసనపరుడై.. ఖర్చులు పెరగడం వల్ల మాదకద్రవ్యాల విక్రయాలకు అలవాటు పడ్డట్లు విచారణలో తెలింది. రెండో నిందితుడు సాప్ట్‌వేర్ ఉద్యోగి రోహిత్ ఎక్సటాసి పిల్స్‌కు అలవాటు పడ్డాడు. వాటినే ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.