ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట శివారు వసంతవాడలో హృదయ విదారక ఘటన జరిగింది. సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. వాగులోకి దిగిన ఆ ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై టి. సుధీర్ ఘటనాస్థలికి చేరుకొని... గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి మృత దేహాలను బయటకు తీశారు. కుక్కునూరు సీఐ బాల సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతులు..
మృతులు... శ్రీరాముల శివాజీ, గంగాధర్ వెంకట్, కునరాల రాధాకృష్ణ, కర్నాటి రంజిత్, కెల్లా భువన్, గొట్టపర్తి మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. వీరిలో కొంతమంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా... భువన్ వ్యవసాయ కోర్సు విద్యార్థి. వేలేరుపాడు విషాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.