మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటి ముందు స్నేహితుడితో ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా చిన్న పోచారం గ్రామానికి చెందిన సత్తయ్య జీవనోపాధి కోసం కుటుంబసభ్యులతో కలిసి ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామానికి వచ్చాడు. కుమారుడు గణేశ్(7) ఇంకో బాలుడితో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు.
ఇంటి కోసం తీసిన గుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి
అప్పటివరకు ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలున్ని ఓ గుంత మింగేసింది. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆ ప్రదేశానికి సమీపంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం గుంతలు తీశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో నీరు వచ్చి చేరింది. గణేశ్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయాడు. పక్కనే ఉన్న బాలుడు విషయాన్ని ఇంటికి వెళ్లి పెద్దలకు చెప్పాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరి... స్థానికుల సాయంతో బాలుడిని బయటకు తీశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.