తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆర్జీయూకేటీలో దొంగ అధికారి... విలువైన సామగ్రి ఇంటికి తరలింపు - iiit Security officer latest

ఆయన బాసర ఆర్జీయూకేటీ విద్యాలయానికి భద్రతాధికారి. సంస్థ విలువైన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అతనిదే. విద్యాలయం ఆస్తులు ఇతరుల పరం కాకుండా, విద్యాలయంలోని ప్రతి వస్తువుకు, విద్యార్థుల భద్రతకు ఆయనే జవాబుదారీ. అయితే కంచే చేను మేసినట్టుగా ఆయనే విద్యాలయంలోని విలువైన వస్తువులను మాయం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే పలు వస్తువులను విద్యాలయ గేటు దాటించారు. విషయం తెలిసిన విద్యాలయ అధికారులు ఆయన తీరుపై మండిపడుతున్నారు.

IIIT
IIIT

By

Published : Aug 12, 2020, 6:03 PM IST

Updated : Aug 12, 2020, 6:08 PM IST

బాసర ట్రిపుల్‌ ఐటీలోని విలువైన సామగ్రిని భద్రతాధికారి విద్యాలయాన్ని దాటించాడు. మంగళవారం ఉదయం రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేట్‌ వాహనాన్ని (ఏపీ 39యూ 5615) తన బలగంతో బలవంతంగా అడ్డగించి విద్యాలయంలోకి తీసుకెళ్లాడు. అక్కడి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో నిల్వఉన్న విద్యాలయానికి చెందిన ఇనుప సామగ్రి, స్క్రాప్‌ని ఆ వాహనంలో సిబ్బందితో ఎక్కించాడు. గతంలో విద్యాలయంలో పలు రకాల పక్షులను పెంచేందుకు పంజరాలను, ఇనుప జాలీలను తయారు చేశారు.

మరమ్మతులు చేయించి

విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు వివిధ పక్షుల పెంపకానికి నిర్ణయించి విద్యాలయానికి చెందిన వేలాది రూపాయల నిధులతో ఇనుప పంజరాలను భారీసంఖ్యలో తయారు చేశారు. విద్యాలయంలో లాక్‌డౌన్‌ ఉండి విద్యార్థులు, సిబ్బంది లేకపోవటంతో సదరు అధికారి వాటిని తీసుకువచ్చి విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో నిల్వచేశాడు. మరమ్మతులు అవసరమైన వాటికి విద్యాలయ విద్యుత్తును ఉపయోగించి సబ్‌స్టేషన్‌లోనే ఓ ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా మరమ్మతులు చేయించాడు. చివరకు అదను కోసం చూసిన ఆయన మంగళవారం ఓ వాహనంలో రాజధానిలోని తన ఇంటికి తరలించాడు.

పక్షులను తీసుకువెళ్లేందుకు విఫలయత్నం

విద్యాలయంలోని ఉపకులపతి నివాసంలో పలు రకాల పక్షులను పెంచుతున్నారు. అతిథిగృహ సమీపాల్లో విషపూరిత పాముల కదలికలు ఎక్కువగా ఉండటంతో వాటిని నిరోధించే బాతులు, సీమకోళ్లను పెంచారు. వాటిని తీసుకువెళ్లేందుకు సదరు అధికారి విఫలయత్నం చేశాడు. అతిథిగృహనికి తాళాలు ఉండటంతో తన కిందపనిచేసే సిబ్బందిని అతిథిగృహ ప్రహరీ ఎక్కించి మరీ పక్షులను తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. విద్యాలయ పరిపాలన అధికారి రాజేశ్వర్‌రావుకు విషయం తెలియటంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పక్షులను వదిలేసి వాటి గుడ్లను తీసుకువెళ్లాడు.

అధికారి అయితే ఇలా

విద్యాలయంలోకి ప్రవేశం, నిష్క్రమణకు సంబంధించి ఆయన చెప్పిందే వేదం కావటంతో వస్తువుల తరలింపు ప్రక్రియ ఆయనకు సులభమైంది. సాధారణ ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంత వస్తువులను లోనికిగాని, బయటకుగాని తీసుకెళ్తే పదిసార్లు తనిఖీలు చేసే భద్రతాసిబ్బంది ట్రక్‌లో విలువైన విద్యాలయ సామగ్రి తరలుతున్నా ఏమి చేయలేకపోయారు. ఉన్నతాధికారి ఆగ్రహానికి గురికావాల్సివస్తుందని ఆ ట్రక్‌కు విద్యాలయ ద్వారాలు తెరచి సాగనంపారు.

Last Updated : Aug 12, 2020, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details