బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే దేవరాజ్, సాయికృష్ణా రెడ్డిని అరెస్టు చేశారు. ఏ2 గా ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్‌నగర్ ఠాణాకు వస్తానని చెప్పి... చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు.
అవకాశాలు ఇస్తానంటూ..
సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు.
కీలకంగా వ్యవహరించాడా?
ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. పసిగట్టిన దేవరాజ్, అశోక్‌రెడ్డి తప్పించుకునేందుకు పథకం వేశారు. దేవరాజ్ ఊరెళ్లినట్టు పోలీసులకు బురిడీ కొట్టించినట్టు విశ్వసనీయ సమాచారం. అశోక్‌రెడ్డి పేరు తెరమీదకు రాగానే సాయికృష్ణ ద్వారా దేవరాజ్ పేరు బయటకు తెచ్చారు.