నారాయణపేట జిల్లాలో ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. ప్రధానంగా మక్తల్ నియోజకవర్గం కేంద్రంగా... ఇసుక దందా కొనసాగుతోంది. జిల్లాలోని ఊట్కూరు, మాగనూరు, మక్తల్ మండల పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల మేర పెద్ద వాగు ప్రవహిస్తోంది. ఈ వాగు పరిధిలోనే అక్రమార్కులు ఇసుక దందాను నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ. 40 వేలు, ట్రాక్టర్ రూ.6 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలు జిల్లా వ్యాప్తంగా వివాదాలకు దారితీస్తున్నాయి.
సెప్టెంబర్ నెలలో నారాయణపేట శివారు జలాల్పూర్లో ఉన్న ఇసుక డంపు వద్ద జరిగిన గొడవ వ్యవహారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది. గత నెల మరికల్ మండలంలోని జిన్నారం వద్ద మణి వాగు నుంచి ఇసుక తరలిస్తుంటే స్థానికులు అడ్డుకోగా... ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళినా... కనీసం కేసు కూడా నమోదు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా మాగనూరు మండలం నెరడగం వాగు నుంచి ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తుండగా స్థానిక రైతులు అడ్డుకున్న ఘటనలో రైతుతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయపడ్డారు. వారిద్దరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.