అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్, విశాఖ సీబీఐ ఎస్పీ, కర్నూలు ఎస్పీ, నంద్యాల డీఎస్పీ, నంద్యాల 1వ పట్టణ ఠాణా స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌లకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 15కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల జాబితా నుంచి కేంద్ర విజిలెన్స్ కమిషనరును తొలగించాలంది.
సలాం ఆత్మహత్య కేసు: డీజీపీకి హైకోర్టు నోటీసులు
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సహా పలువురికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 15కు వాయిదా వేసింది.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దర్యాప్తు సరైన దిశలో జరగకపోతే పిటిషనరు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్లు వేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:'అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు'