ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఇప్పుడు దొంగలముఠాలు దర్శనమిస్తున్నాయి. దారిదోపిడీలకు పాల్పడుతూ.. ప్రజలను బెదిరిస్తూ... అందినకాడికి నగదును లాక్కుంటున్నారు. అటుగా వెళ్లే వారిని బెదిరించి దాడులకు పాల్పడుతున్నారు. తెల్లవారితే చాలు సాగర తీరంలో ఆహ్లాదంగా కాలినడకన వెళ్లే వారు.. ఇప్పుడు భయపడుతున్నారు. ఐదారు రోజులుగా.. నాలుగు స్టేషన్ల పరిధిలో వరుస కేసులు నమోదయ్యాయి. లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఒంటరిగా రహదారిపై వెళుతున్న ద్విచక్రవాహన దారులను బెదిరించి సెల్ఫోన్లను లాక్కోవడం... బీచ్ రోడ్డులో వాకింగ్ చేసే వారిపైనా దౌర్జన్యం చేయడం... వారందరి అంతిమలక్ష్యం. కనిపించిన ప్రతి ఒక్కరిని బెదిరించి వారి దగ్గరనుంచి నగదును దోచేస్తున్నారు.
బ్లేడ్ మింగేశాడు..
కల్లు పాకలు ప్రాంతానికి చెందిన ఈర్ల వినయ్ కుమార్‌తో పాటు.. మరో ఇద్దరు నిందితులు మాదక ద్రవ్యాలు, గంజాయికి బానిసలై దారిదోపిడి చేస్తున్నారు. బీచ్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ మహిళకు కత్తి చూపించి చంపేస్తామని బెదిరించి... ఆమె నుంచి సెల్‌ఫోన్ లాక్కుని దాని పాస్‌వర్డ్‌ను బలవంతంగా తెలుసుకున్నారు. ఆమెపై దాడి చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు ఈర్ల వినయ్ కుమార్ పోలీసుల అరెస్టు సమయంలో సర్జికల్ బ్లేడ్‌ను మింగేశాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రికి తరలించి ఆ బ్లేడ్‌ను బయటకు తీయించారు. ఈర్ల వినయ్ కుమార్‌పై రౌడీషీట్ సైతం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దోపిడీ, స్నాచింగ్,దొంగతనాలు, హత్యాయత్నాలు వంటి కేసులతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదయ్యాయి.