తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'దారి'కాచిన మృత్యువు - తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్‌స్పాట్స్

తెలంగాణ ఏటేటా రహదారులపై జరిగే ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో 485 ప్రమాదకర ప్రాంతాల్లో 2,376 మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. వీటిని నివారించేందుకు ప్రభుత్వం రూపొందించిన రహదారి భద్రతా చట్టం మాత్రం అమలులోకి రాకుండా అధికారులు దస్త్రాల్లోనే భద్రంగా ఉంచారు.

road accidents increased in telangana from last 3 years says survey
'దారి'కాచిన మృత్యువు

By

Published : Feb 3, 2020, 4:42 PM IST

తెలంగాణలోని పలు రహదారులపై ప్రమాదకర ప్రాంతాల (బ్లాక్‌ స్పాట్స్‌) సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రమాద మృతుల సంఖ్యా పెరుగుతోంది. అలాంటిచోట్ల దిద్దుబాటు చర్యలు మాత్రం ఉండడంలేదు. ఒకేచోట తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే దాన్ని పోలీసుశాఖ ప్రమాదకర ప్రాంతంగా గుర్తిస్తుంది. ఆ వివరాలను రహదారులు భవనాలశాఖకు పంపుతుంది. అలాంటి ప్రాంతాలు జాతీయ రహదారుల్లో ఎన్ని ఉన్నాయి? రాష్ట్ర రహదారుల్లోని ప్రాంతాలెన్ని? జిల్లా ప్రధాన మార్గాల్లో ఎన్ని ఉన్నాయని అధికారులు విశ్లేషిస్తారు. ప్రమాదకర ప్రాంతమా? కాదా? ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి? అన్న అంశంపై నిపుణులతో రహదారులు భవనాలశాఖ, జాతీయ రహదారుల సంస్థ అధ్యయనం చేయిస్తుంది.

'దారి'కాచిన మృత్యువు

ప్రమాదాల తీవ్రత ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. మొదటి కేటగిరిలో దిద్దుబాటు చర్యలకు తొలి ప్రాధాన్యమిస్తారు. మిగిలిన రెండు కేటగిరీల్లో నిధుల మేరకు చర్యలు చేపడతారు. ప్రతి ప్రమాదాన్ని పోలీసులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తారు. వేగం కారణంగా జరిగిందా? నిర్లక్ష్యమా? రోడ్డు నిర్మాణ లోపమా? అని తొలిదశలో గుర్తించి రహదారులు-భవనాల శాఖకు పంపుతారు. అయితే ఈ దిద్దుబాటు చర్యల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ప్రమాదకర ప్రాంతాన్ని గుర్తించాక దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఏడాది వరకూ పడుతోందని అధికారులు అంగీకరిస్తున్నారు.

'దారి'కాచిన మృత్యువు

తాజాగా పోలీసులు గుర్తించిన 485 ప్రమాదకర ప్రాంతాల్లో రహదారులు-భవనాల శాఖ పరిధిలోనివి 314గా గుర్తించారు. మిగిలిన 171 ప్రాంతాల్లో జాతీయ రహదారుల సంస్థ పరిధిలో ఉన్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాలకు దిద్దుబాటు చర్యలు ఎప్పుడు చేపడతారన్నది అధికారులకే తెలియాలి.

'దారి'కాచిన మృత్యువు

ఇది నాలుగు వేల మంది జనాభా ఉన్న సదాశివపేట సమీపంలోని నందికంది గ్రామాన్ని రెండుగా చీల్చుతూ నిర్మించిన ముంబయి వెళ్లే జాతీయ రహదారి. గత మూడేళ్లలో ఆ గ్రామ శివారులో 31 ప్రమాదాలు జరిగాయి. 22 మంది మృత్యువాత పడ్డారు. భద్రతా చర్యలపై మూడేళ్లుగా పట్టించుకున్న నాథుడు లేడు.

పెరుగుతున్న మృతుల సంఖ్య

రాష్ట్రంలో రహదారి ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతోంది. రహదారులు కొంతమేరకు మెరుగ్గా ఉండటంతో వాహనాల వేగం పెరిగి.. ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్లలో ప్రమాదాల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ మృతుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది.

రహదారుల నిర్మాణాల్లో లోపాలతోపాటు గ్రామాల నుంచి వెళ్లే మార్గాల్లో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టకపోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రతి రాష్ట్రంలో రహదారి భద్రతా చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం సుమారు రెండేళ్ల క్రితం చెప్పింది. అధికారులు కసరత్తు చేసి ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. దాన్ని అటకెక్కించి మరో ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. ఆ ప్రతిని సిద్ధం చేసి ఏడాది దాటినా పట్టించుకున్న వారే లేరు. రహదారి భద్రతా చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తే వివిధ శాఖల మధ్య సమన్వయానికి మార్గం సుగమం అవుతుంది.

ఇదీ చదవండిఃభారీగా ఐఏఎస్​ల బదిలీలు... కొత్త పోస్టింగ్​లు ఇవే...

ABOUT THE AUTHOR

...view details