తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉన్మాదికి మరణదండన విధించాలి: యువతి బంధువులు - Young woman murdered in vijayawada news

విజయవాడ మాచవరంలో యువతి దారుణ హత్యపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వపరంగా పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.

ఉన్మాదికి మరణదండన విధించాలి: యువతి బంధువులు
ఉన్మాదికి మరణదండన విధించాలి: యువతి బంధువులు

By

Published : Oct 15, 2020, 8:45 PM IST

క్రీస్తురాజపురంలో ఓ యువతి తనను ప్రేమించటం లేదంటూ కత్తితో దాడి చేసి చంపేశాడు ఓ యువకుడు. ఈ ఘటన విజయవాడ నగరంలో కలకలం రేపింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఉన్మాదికి మరణదండన విధించాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటితో వేడుకుంటున్నారు.

చిన్నపిల్లలను కత్తితో పొడిచి చంపేశాడు. అలాంటోడిని బతకనివ్వకండి. వాడు మరోసారి ఇలాంటి పనులు చేయకూడదు. ఒక్కగానొక్క కూతురిని చంపేశాడు. వాడిని చంపేయండి - మృతురాలి బంధువు

మరోవైపు ఈ ఘటనను మహిళా సంఘాలు ఖండించాయి. నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటివి పునరావృతం కావని మహిళా సమాఖ్య ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గాభవాని అభిప్రాయపడ్డారు. ప్రేమపేరుతో దారుణాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. నేరాలకు తగిన శిక్ష పడితేనే ఆడపిల్లలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తాం

మహిళలను వేధించిన వారికి కఠిన శిక్షలు పడాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ వంటి చట్టాలను కేంద్రం వెంటనే అమలు చేయాలని కోరారు. నిందితులకు 21 రోజుల్లో శిక్షలు పడాలని... ఇలాంటి ఘటనలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలు మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లి... ప్రభుత్వపరంగా పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

విజయవాడలో జరిగిన ఈ ఘటనను పోలీసులు సీరియస్​గా తీసుకున్నారు.ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థిని తల్లిదండ్రులతో సీపీ శ్రీనివాసులు మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఘటనకు కారణాలు, ఇతర అంశాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు. నిందితుడి పరిస్థితి కాస్త మెరుగైతే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details