సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మోసాలకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఉడేగోళం గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు రైల్వేలో ఉద్యోగం పేరుతో నాలుగున్నర లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఉద్యోగం వచ్చిందంటూ 40 రోజులు పని కూడా చేశాడు. తీరా ఇదంతా మోసమని తెలిసి రాఘవేంద్ర కుటుంబీకులు గుండెలు బాదుకుంటున్నారు.
రైల్వేలో జాబు అన్నారు... లక్షలు దోచేశారు - railway job cheating in ap
రైల్వే జాబు ఇప్పిస్తామనే వారిని నమ్మవద్దని రైల్వేశాఖ ఎన్ని ప్రకటనలు ఇచ్చినా... ఫలితం లేకపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి అమాయకత్వమే... మోసగాళ్లకు ఆసరాగా మారింది. అలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్లో రైల్వే సూపర్ వైజర్ ఉద్యోగాన్ని ఇస్తామని తన స్నేహితుడి ద్వారా గుంటూరుకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి ఆశ చూపాడు. రాఘవేంద్ర.. అతనికి రెండు విడతలుగా నాలుగున్నర లక్షలు ఇచ్చాడు. తీరా ఇదంతా మోసం అని తెలిసి, డబ్బులు వెనక్కి ఇవ్వమంటే అందుకు నిరాకరిస్తున్నాడని బాధితులు వాపోయారు. ఉద్యోగమంటే అప్పు చేసి డబ్బు ఇచ్చామని రాఘవేంద్ర తల్లి యశోదమ్మ కన్నీరు పెట్టుకుంది. తమకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు జరిపి బాధ్యులను పట్టుకోవాలంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో రాఘవేంద్ర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి :కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం