విజయవాడకు చెందిన కంపా హృదయానంద్ (30).. 2017లో అనూష అలియాస్ హారిక(20)ను పెళ్లి చేసుకున్నాడు. హారిక అంతకుముందు మరో వ్యక్తిని పెళ్లిచేసుకుని విడాకులు కూడా తీసుకుంది. అనంతరం హృదయానంద్ అనారోగ్యం పాలవడంతో ఏ పనీ చేయలేకపోయాడు. ఈ క్రమంలో హారిక హైదరాబాద్‌లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉద్యోగంలో చేరింది. చాలీచాలని సంపాదనతో సంతృప్తి చెందక ఈ దంపతులు ఆన్‌లైన్ మోసాలకు పథకం వేశారు.
ఇండియన్ డేటింగ్.కామ్
హారికా హృదయానంద్ పేరిట ఓ ఫేక్ ప్రొఫైల్ తయారుచేసి గుర్తుతెలియని అందమైన యువతి ఫొటోతో ఇండియన్ డేటింగ్.కామ్ అనే వెబ్‌సైట్‌లో పోస్టుచేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన డోనాల్డ్ హోరసీస్ రోజారియో అనే వ్యక్తి చాటింగ్ మొదలెట్టాడు. హృదయానంద్ తాను యువతినని భ్రమింపజేస్తూ చాటింగ్ చేయడం ప్రారంభించాడు. చివరకు గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి శస్త్రచికిత్సకు ఆర్థికసాయం కావాలంటూ కోరింది. అతను ఆన్‌లైన్‌లో డబ్బు పంపాడు. మరికొన్ని రోజుల తర్వాత తల్లి మరణించిందని, తన సోదరి సర్జరీ కోసమని పలుమార్లు డబ్బు అడిగింది. ఇలా పలు దఫాలుగా డోనాల్డ్ రూ.21లక్షలు ఆమెకు ఆన్‌లైన్‌లోనే చెల్లించాడు.