పదిరోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాల ముఠాను అరెస్టు చేశామని.. ఇప్పుడు రెండోసారి మరో ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 50 లక్షలు విలువచేసే నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎస్వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ హయత్‌నగర్‌లోని బ్రాహ్మణపల్లిలో ఓ గోదాం తీసుకుని నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారని వివరించారు. ప్రధాన నిందితుడు కర్నూల్ జిల్లాకు చెందిన చింతల వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఐదు మంది ముఠాగా ఏర్పడి విత్తనాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేయగా.. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.