బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఎస్సార్‌నగర్ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్‌రెడ్డి నిరాకరించడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డి నుంచి మూడు రోజులుగా వివిధ కోణాల్లో సమాచారం సేకరిస్తున్న పోలీసులు ఆదివారం వారిద్దరినీ కలిపి విచారించారు. వారి మధ్య గొడవకు కారణమైన అంశాలపై తాజాగా ఇద్దరినీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శ్రావణికి తొలుత సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు లభించాయి. అనంతరం టీవీ సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి.
అయితే శ్రావణి.. ఏడాది క్రితం పరిచయమైన దేవరాజ్ రెడ్డితో చనువుగా ఉండటాన్ని సాయికృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. ఆమె కుటుంబ సభ్యుల ద్వారా పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. దీనికి శ్రావణి అంగీకరించకపోవడం వల్ల వివాదం మొదలైంది. మరోవైపు దేవరాజ్‌రెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రావణికి నిరాశే ఎదురైంది. ఇటీవల వరుసగా జరుగుతున్న గొడవలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. శ్రావణిని పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్‌రెడ్డి నిరాకరించాడు. ఇదే విషయాన్ని ఆమె మొబైల్ ఫోన్‌కు సందేశం పంపారు.