హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్టేషన్ పరిధిలో కిలోన్నర బంగారు ఆభరణాల సంచి మాయం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 9న ప్రదీప్ అనే సేల్స్‌మెన్ బషీర్ బాగ్‌లోని వీఎస్ జూవెల్లరీస్కి చెందిన కిలోన్నర బంగారు ఆభరణాల సంచిని తీసుకుని జూబ్లిహిల్స్‌లోని కృష్ణా పెరల్స్ అండ్ జూవెలర్స్కి వెళ్లాడు. అక్కడ కొనుగోలుదారుడికి చూపించిన తర్వాత తిరిగి వాటిని తీసుకుని వస్తుండగా భారీ వర్షం పడింది.
వరద ప్రవాహం వల్ల కిందపడ్డాడు..
బంజారాహిల్స్ రోడ్ నం. 3 మీదుగా వెళ్తుండగా వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్నందున గుంతలో ద్విచక్ర వాహనం ఇరుక్కుని ప్రదీప్ కిందపడ్డాడు. దీంతో కాళ్ల మధ్యలో పెట్టుకున్న బంగారు నగల సంచి నీటిలో కొట్టుకుపోయింది. తన సోదరుడికి సమాచారం ఇవ్వగా అక్కడకి చేరుకున్న సోదరుడితో కలిసి ప్రదీప్ ఆ వరద నీటిలో వెతికాడు. వీరితో పాటు దుకాణ యజమాని, 15 మంది సిబ్బంది, స్థానికులు రాత్రి 10 గంటల వరకు వెతికారు.