మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 15 రోజుల క్రితం ఇంట్లో నేపాల్‌కు చెందిన ఆర్జున్, మాయలు యజమానులు విధులకు వెళ్లిన సమయంలో వృధ్ధురాలికి మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన 8 బృందాలు నేపాల్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, కోల్‌కతా సరిహద్దులతో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.
ఆ నేపాలీల కోసం 8 బృందాలతో గాలింపు
హైదరాబాద్‌లో కొన్ని నేపాలీ ముఠాలు వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్నాయి. ఒకప్పుడు ఇళ్లలో దొంగలు పడకుండా నేపాలీకి చెందిన గుర్ఖాలు కాపు కాచే వారు. ఇప్పుడు కొన్ని ముఠాలు వరుసగా చోరీలకు పాల్పడుతూ గుబులు పుట్టిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రాయదుర్గం పరిధిలో జరిగిన చోరీ కేసుల వెనక నేపాలీలే ఉన్నారు. ముందు ఇళ్లలో పనిలోకి చేరతారు. కొన్ని రోజులు నమ్మకంగా పనిచేస్తూనే ఇంటి సమాచారాన్నంతా సేకరిస్తారు. అనంతరం తమ పనితనాన్ని చూపిస్తారు. మత్తు మందు ఇచ్చి నగదు, బంగారు, వెండి ఆభరణాలతో పరారవుతారు. తాజాగా నాచారంలో ఇలాంటి చోరీ జరిగింది.
నిందితులను పనిలో పెట్టిన ఏజెంట్ లక్ష్మీనారాయణను పోలీసులు ఉప్పల్‌లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళవారం ఉదయం యజమాని అతని కుమారుడు విధులకు వెళ్లగా భార్య, కుమార్తె మెదక్‌లోని ఓ శుభకార్యానికి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంట్లో ఉన్న ప్రదీప్ తల్లి లలితమ్మకి రుమాలులో మత్తుమందు పెట్టి ఆమె ముక్కుపై పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న రూ. 10 లక్షల నగదు, 18 తులాల బంగారం, 40 తులాల వెండితో పారిపోయినట్లు బాధితులు తెలిపారు.