మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో ఈనెల 1వ తేదీన తలకు, చేతికి గాయాలతో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. వైద్యులు నిర్వహించిన శవపరీక్షలో తీవ్రంగా గాయపరచడం వల్ల మృతి చెందినట్లు నిర్ధరణ అయిందని పోలీసులు తెలిపారు. గంగారం అంజయ్య(50) ఘట్కేసర్లోని ఓ దుకాణంలో టైలర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 1వ తేదీ ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు. ఓ వ్యక్తి నుంచి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఘట్కేసర్ పోలీసు పెట్రోలింగ్ పోలీసులు అంజయ్య ఇంటికి వచ్చారు. అప్పటికే అంజయ్య తలకు, చేతికి గాయాలతో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. శవ పరీక్షలో తీవ్రంగా కొట్టడం వల్ల మృతి చెందినట్లు తేలింది. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో పలు కీలక వివరాలు రాబట్టారు.
కుటుంబ సభ్యులపై అనుమానంతో..
దర్యాప్తు చేపట్టిన సీఐ చంద్రబాబు మృతుడికి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరిపారు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవని తేలింది. అంజయ్యకు మద్యం తాగే అలవాటు ఉంది. నిత్యం తాగి వచ్చి భార్య, కొడుకుతో ఘర్షణకు దిగేవాడని పోలీసులు గుర్తించారు. మత్తులో భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేసేవాడు. వస్తువులను నష్టపరిచేవాడు. ఇలా చేస్తే పెళ్లి కావాల్సిన కొడుకుకు అమ్మాయిని ఎవరు ఇస్తారని పలుమార్లు భార్య భర్తతో చెప్పింది. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో పాటు వేధింపులు ఎక్కువ అయ్యాయి.