తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మావోయిస్టులకు సహకరిస్తున్నారని హక్కుల నేతలపై పోలీస్ కేసులు..! - హక్కుల నేతలపై పోలీస్ కేసులు

మావోయిస్టు కార్యకలాపాలకు సహకారాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజా హక్కుల నేతలపై పోలీసు కేసులు పెట్టడం కలకలం రేపుతోంది... పౌరహక్కుల సంఘం, మానవహక్కుల ఫోరం, విరసం వంటి సంఘాల నేతలపై యుఏపీఏ సహా పలు తీవ్రమైన సెక్షనలతో ఏపీలోని విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదు చేశారు. విశాఖ జిల్లా వాకపల్లి ఆదివాసీ మహిళలపై పోలీసుల అత్యాచారం కేసులో... బాధితులకు అండగా ఉంటున్నందుకే కేసులు పెట్టారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 23, 24వ తేదీలలో నమోదైన కేసుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Police cases against rights leaders who are collaborating with the Maoists
మావోయిస్టులకు సహకరిస్తున్నారని హక్కుల నేతలపై పోలీస్ కేసులు..!

By

Published : Nov 27, 2020, 1:46 PM IST

2007లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా వాకపల్లి అత్యాచారం ఘటనలో బాధితుల తరఫున పోరాడుతున్న వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులపై పోలీసులు ఈ నెల 23, 24 తేదీలలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే మావోయిస్టులతో సంబంధాల విషయంలో ఆధారాలు ఉన్నందునే కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.

ఏం జరిగిందంటే...!

నవంబర్ 23వ తేదీన విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడ గ్రామం వద్ద.. పాంగి నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా విలేకరిగా పనిచేస్తున్న అతను.. మావోయిస్టులకు మందులు, సాహిత్యం, అవసరమైన సామగ్రి అందజేస్తూ ఉంటాడని... ముందస్తు సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నామని ఎఫ్​ఐఆర్​లో నమోదు చేశారు. అతని దగ్గర నుంచి కొన్ని మందులు.. బ్యాటరీలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఏపీ పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల ఫోరం ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, వి.ఎస్. కృష్ణ సహా.. వివిధ ప్రజాసంఘాలు, హక్కుల, సాహిత్య సంఘాల ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు.

మంచంగిపుట్టు పోలీసు స్టేషన్​లో 64 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ సహా, వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​లో మావోయిస్టు అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గాజర్ల రవి, చలపతి వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. వీరందరినీ హక్కుల సంఘాల నేతలు వివిధ సందర్భాల్లో కలిసినట్లు నాగన్న తెలిపాడని పేర్కొన్నారు.

పిడుగురాళ్లలో 27 మందిపై..

మరోవైపు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 24న వివిధ సెక్షన్ల కింద 27మందిపై కేసులు పెట్టారు. జలకల్లు గ్రామంలో పిడుగురాళ్ల పోలీసులు తనిఖీలు నిర్వహించగా... పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూపునకు చెందిన కంభంపాటి చైతన్యను అదుపులోకి తీసుకున్నామని నమోదు చేశారు. అతనితో పాటు మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారని మరో 26 మందిపైనా కేసులు నమోదు చేశారు.

వాకపల్లి బాధితుల పక్షాన ఉన్నందుకే

పోలీసు కేసులపై హక్కుల సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2007లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వాకపల్లి.. ఆదివాసీ మహిళల అత్యాచారం కేసులో గిరిజనులకు అండగా నిలిచినందుకే.. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 2007 ఆగస్టులో మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుపుతూ ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు వాకపల్లి గ్రామాన్ని చుట్టుముట్టాయి. అప్పుడు గిరిజనులకు.. పోలీసు దళాలకు గొడవ జరిగింది. తమపై పోలీసులు అత్యాచారం చేశారని 13మంది వాకపల్లి మహిళలు ఆరోపించారు. వీరికి ప్రజాసంఘాలు మద్దతు ఇచ్చాయి. పోలీసులపై కేసు నమోదు అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. "ప్రస్తుతం విచారణ కీలక దశకు చేరిందని.. దాని ప్రభావితం చేసేందుకే ..బాధితుల పక్షాన పోరాడుతున్న తనపై కేసు పెట్టారని" మానవ హక్కుల ఫోరం కార్యదర్శి వి యస్ కృష ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే... తనను కలిసి... వాకపల్లి కేసు విషయంలో మహిళలను రెచ్చగొట్టాలని సూచనలు ఇచ్చినట్లుగా ఎఫ్​ఐఆర్​లో నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు.

ఇదీ చదవండి:దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details