తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాట్సాప్​ ద్వారా హవాలా... గుట్టు రట్టు చేసిన పోలీసులు... - latest news in vijayawada

రూ.10 నోటు చూపిస్తే చాలు.. మీకు రూ.కోటి ఇచ్చేస్తారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. చాప కింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న హవాలా రాకెట్‌లో రూ.10 నోటే కీలకమైంది. పన్నులు ఎగ్గొట్టి రూ.కోట్లలో నగదును బెజవాడ నుంచి దేశంలో ఎక్కడికైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

hawala
hawala

By

Published : Nov 30, 2020, 5:07 PM IST


పన్నులు ఎగ్గొట్టి రూ.కోట్ల సొమ్మును దేశాలు దాటిస్తున్నారు. తాజాగా ఏపీలోని విజయవాడ నుంచి గుంతకల్‌కు హవాలా ద్వారా పంపించేందుకు సిద్ధంగా ఉన్న రూ.కోటి నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వాట్సాప్‌ గ్రూపు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా హవాలా ముఠా నిర్వహిస్తున్న ఈ లావాదేవీలను పోలీసులు రట్టు చేశారు.

పక్కా ప్లాన్​ ప్రకారం...

హవాలా ముఠా లావాదేవీలన్నీ వాట్సాప్‌లోనే సాగుతుంటాయి. ముందుగా ముఠా సభ్యులంతా కలిసి ఒక వాట్సాప్‌ గ్రూపుగా ఏర్పడతారు. తొలుత డబ్బును ఒక చోటకు చేరుస్తారు. ఆ తర్వాత ఎవరికి, ఎలా ఇవ్వాలో ప్రధాన సూత్రధారి నిర్ణయిస్తారు. డబ్బును ఎవరు తీసుకుంటారో.. వారికి ఒక రూ.10 నోటు ఇస్తారు. దీనికి ముందు ఆ నోటు ఫొటో తీసి హవాలా సభ్యుడికి వాట్సాప్‌ ద్వారా పంపిస్తారు. రూ.10 నోటు తీసుకున్న వ్యక్తి తనకు కావాల్సిన చోటుకు వెళ్లి, అక్కడున్న హవాలా సభ్యుడికి ఆ నోటు ఇస్తారు. నోటు మీద ఉన్న సీరియల్‌ నంబరే నగదు లావాదేవీల కోడ్‌గా పరిగణిస్తారు. కోడ్‌ సరిపోలితే నోటు తెచ్చిన వ్యక్తికి హవాలా సొమ్ము మొత్తం ఇచ్చేస్తారు. ఇలా రూ.10 నోటే హవాలా రాకెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తోంది. దీన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు విజయవాడ నుంచి గుంతకల్‌కు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రూ.కోటి నగదును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దర్యాప్తు

ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఇంద్రసింగ్‌, గుంతకల్‌కు చెందిన ఉదయ్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సెల్​ఫోన్లు వ్యాపారం చేసే వారిగా గుర్తించారు. గుంతకల్‌లో మరో ప్రధాన సూత్రధారి ఒకరు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నగదు మొత్తం ఎక్కడిది? ఎలా సేకరించారు? ఎవరికి ఇస్తున్నారు? వంటి విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదును విజయవాడలో పలువురి నుంచి సేకరించినట్లు సమాచారం. ఇదంతా లెక్కల్లో ఉన్న సొమ్మా? లేక నల్లధనమా? అనేది తేలాల్సి ఉంది. గుంతకల్‌కు చెందిన ప్రధాన సూత్రధారి పట్టుపడితే.. ఇది ఎవరి సొమ్ము అనేది తేలిపోతుందని పోలీసులు అంటున్నారు.

ఇదీ చదవండీ:హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. అలా దొరికిపోయాడు

ABOUT THE AUTHOR

...view details