'నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేననే భయం నన్ను వెంటాడుతోంది... తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగుల్చుతున్నా'అంటూ తన అన్నయ్య చరవాణికి మెసేజ్ పంపిన ఆ విద్యార్థి అదృశ్యమయ్యాడు. చివరికి సముద్రంలో శవమై తేలాడు. ఎస్సై దీనబంధు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సందేశం పంపి... సముద్రంలోకి దూకి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తునిలోని గరువువీధికి చెందిన కె.మోహిత్కుమార్ (20) రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొవిడ్ కారణంగా కొన్నాళ్లు ఇంటి వద్దే ఉన్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటం వల్ల చదువుకోవడానికి వీలుగా ఉంటుందని నాగులచవితికి ముందు రోజు వసతిగృహంలో ఉండేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి శనివారం రాత్రి తుని వచ్చాడు. ఇంట్లో వారికి తెలియకుండా గ్రిల్స్లోంచి బ్యాగు, ఇతర వస్తువులు లోపల వేశాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనం తీసుకుని బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 సమయంలో అతని అన్నయ్య ఆదర్శకుమార్ చరవాణికి మోహిత్కుమార్ సంక్షిప్త సమాచారం పంపాడు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదవలేకపోతున్నానని, ద్విచక్రవాహనం పాల్మన్పేట తీరప్రాంతంలో ఉంచానని అందులో పేర్కొన్నాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తీరప్రాంతానికి చేరుకున్నారు. రత్నాయంపేట సముద్రపు ఒడ్డున ఉన్న జెట్టీ పక్కన బైకు గుర్తించారు. యువకుడి ఆచూకీ లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.