కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన మెరుగు నర్సాగౌడ్, నారాగౌడ్తో కలిసి... పట్టణంలో షాపింగ్ పూర్తి చేసుకుని పెద్దమల్లారెడ్డికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అతిథి బార్ వద్దకు రాగానే... ద్విచక్రవాహనాన్ని కామారెడ్డి నుంచి మందాపూర్‌కు వెళ్తున్న ఓ అద్దె బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో నర్సాగౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా... నారాగౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అద్దె బస్సు యజమాని ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన - బస్సు ప్రమాదంలో నామాపూర్ వ్యక్తి మృతి
షాపింగ్ కోసం వెళ్లిన ఓ వ్యక్తిని అద్దె బస్సు బలితీసుకుంది. ఈ ఘటన శనివారం రోజు కామారెడ్డిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద జరిగింది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబసభ్యులు బస్సు యజమాని ఇంటి ముందు మృతదేహాంతో బైఠాయించారు.
సమాచారమందుకున్న పోలీసులు... క్షతాగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. నర్సాగౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బస్సు యజమానిని బంధువులు కోరారు. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం వల్ల మృతదేహాంతో పాటు బస్సు యజమాని ఇంటి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. నర్సాగౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబీకులు వస్తున్న విషయం తెలుసుకున్న బస్సు యజమాని... అంతకుముందే ఇంటికి తాళం వేసుకుని పరారయ్యాడు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బాధిత కుటుంబసభ్యులు ఇంటి ముందే బైఠాయించారు.