హైదరాబాద్ బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీఎన్నార్ కళాశాల రోడ్డులో వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ డీసీఎం ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందగా... మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వచ్చిన బసిరెడ్డి, సీత దంపతులు రుద్రవరంలో నివసిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి... మరో వ్యక్తికి తీవ్ర గాయాలు - bike accident
గతంలో ప్రమాదానికి గురైన అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అంతలోనే విధి మళ్లీ కాటేసింది. బ్యాంకుకు వెళ్లి తిరిగివస్తున్న ఆ దంపతులను డీసీఎం రూపంలో ప్రమాదం పలకరించింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా... భర్త చేయి నుజ్జునుజ్జైంది.
కూలీ పని చేసుకొని జీవించే వీళ్లు... బ్యాంకు పని నిమిత్తం... ద్విచక్రవాహనంపై కౌకుర్కు వెళ్లారు. పని ముగించుకుని తిరిగివస్తున్న క్రమంలో... డీసీఎం వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలను స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతి చెందగా... బసిరెడ్డి చేయిపై నుంచి డీసీఎం వెళ్లటం వల్ల నుజ్జునుజ్జైంది. పూర్తిగా నలిగిపోవటం వల్ల చేయి తీసివేయాల్సి వస్తుందని వైద్యులు వెల్లడించారు.
బసిరెడ్డి, సీత దంపతులకు ఓ కుమారుడు ఉండగా... అతనికి కూడా గతంలో ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే అతను కోలుకోగా... అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవంతో కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. డీసీఎం డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.