మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో గంటన్నరలోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. గాంధీనగర్‌కు చెందిన శ్రీకాంత్, మంగ కుమారుడు రాధాకృష్ణ 15 నెలల బాలుడు. అతను తన అక్కతో కలిసి తమ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పద్మ అనే మహిళ అక్కడికి వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి పంపింది. అనంతరం బాలుడిని కిడ్నాప్ చేసింది.
ఆరు బృందాలుగా..
కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. బాలుడితో మాట్లాడిన మహిళ ఆనవాళ్లను స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆ మహిళ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. షాపూర్‌నగర్ రహదారిపై వెళ్తున్న పోలీసు వాహనం చూసి పక్కనే ఉన్న ఓ గల్లిలోకి పద్మ వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. బాలుడుతో సహా ఆమెను పట్టుకున్నారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.