తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా? - బాలుడి కిడ్నాప్​ వార్తలు మహబూబబాద్​

మహబూబాబాద్‌లో దీక్షిత్‌ అనే బాలుడు అపహరణకు గురై.. 48 గంటలు గడిచినా ఆచూకీ లభించలేదు. తన కుమారున్ని దగ్గరి వ్యక్తులే కిడ్నాప్‌ చేసి ఉంటారని.. బాలుడి తండ్రి రంజిత్‌.. పట్టణానికి చెందిన ఐదుగురి పేర్లను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తనతో చాలాసార్లు చూసిన వ్యక్తి కాబట్టి.. రమ్మనగానే బాలుడు వెళ్లి ఉంటాడని ఆయన చెబుతున్నారు. మరోవైపు కిడ్నాపర్‌ మీరేం చేసినా తెలుస్తోందని చెప్పడం వల్ల పది మంది స్థానికులను పోలీసులు విచారించారు.

తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?
తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?

By

Published : Oct 21, 2020, 8:00 AM IST

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం అపహరణకు గురైన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) ఆచూకీ మంగళవారం కూడా దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బాలుడి తల్లికి ఇంటర్నెట్‌ ఫోన్‌ కాల్‌ చేసిన ఆగంతకుడు మళ్లీ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఫోన్‌ చేశాడు. డబ్బులు సిద్ధం చేసుకున్నారా? రేపు(బుధవారం) మళ్లీ ఫోన్‌ చేస్తానని చెప్పి కట్‌ చేశాడని తెలిసింది. ఆ ఇంటర్నెట్‌ కాల్‌ను ట్రాక్‌ చేసేందుకు జిల్లా ఐటీ కోర్‌ విభాగం పోలీసులు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల సైబర్‌ క్రైం నిపుణుల బృందం మంగళవారం పట్టణంలోని పలు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారం దొరకలేదని సమాచారం.

దగ్గరి వ్యక్తులేనని అనుమానం..

తన కుమారుడిని దగ్గరి వ్యక్తులే కిడ్నాప్‌ చేసి ఉంటారని బాలుడి తండ్రి రంజిత్‌ పట్టణానికి చెందిన ఐదుగురి పేర్లను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తనతో చాలాసార్లు చూసిన వ్యక్తి కావడంతోనే బాబు కూడా రమ్మనగానే బైక్‌ ఎక్కి వెళ్లి ఉంటాడని ఆయన చెబుతున్నారు. ఈ కోణంలోనే పోలీసులూ విచారణ చేపట్టారు.

బృందాలుగా విడిపోయి విచారణ..

మరోవైపు ఆదివారం రాత్రి ఫోన్‌ చేసినప్పుడు సదరు కిడ్నాపర్‌ ‘మీరేం చేసినా తమకు తెలుస్తుందని’ చెప్పడం వల్ల స్థానికంగా ఉన్న పది మందిని మంగళవారం మళ్లీ విచారించారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కేసును స్వయంగా పర్యవేక్షిస్తుండగా ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు బృందాలుగా విడిపోయి పలు దఫాలుగా అనుమానితులను విచారిస్తున్నారు. మరో నాలుగు బృందాలు పట్టణంలో గాలిస్తున్నాయి. దీక్షిత్‌రెడ్డితో ఆడుకున్న ఎనిమిది మందికి కొంతమంది అనుమానితుల ఫొటోలను చూపించగా.. వారు కాదని తెలిపారు.

తోచినంత డబ్బు ఇస్తాం.. వదిలిపెట్టండి

"మా బాబు క్షేమమే మాకు ముఖ్యం. కిడ్నాపర్‌ డిమాండ్‌ చేసిన రూ.45 లక్షలు కాకుండా మాకు తోచినంత ఇస్తాం. డబ్బును కూడా సిద్ధం చేసుకున్నాం. ఎలాంటి హాని తలపెట్టకుండా బాబును ఎక్కడైనా వదిలిపెట్టి వెళ్లండి. ఫిర్యాదును వెనక్కి తీసుకుంటాం"

-రంజిత్‌, వసంత, బాలుడి తల్లిదండ్రులు

ఇదీ చదవండి:జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details