నవవధువు ఆత్మహత్యాయత్నం... భార్యాభర్తల మధ్య గొడవే కారణం! - jagadgirigutta latest news

09:18 December 11
నవవధువు ఆత్మహత్యాయత్నం...
ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. కొత్త జీవితాన్ని భాగస్వామితో ప్రారంభించాలనుకుంది. ఇంతలో ఏమైందో ఏమో గానీ... పెళ్లైన నాలుగు రోజులకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రగతినగర్లో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం బొట్టు చెరువు గ్రామానికి చెందిన సాక స్వామి ప్రగతినగర్లో నివసిస్తున్నారు. స్వామి తన పెద్ద కుమార్తె సౌజన్యకు... గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుకు ఇచ్చి ఈనెల 6న వివాహం జరిపించారు. వివాహం అనంతరం శోభనం కోసం 9న ఏర్పాట్లు చేశారు. కానీ 10న ఉదయం సౌజన్య భర్త వెంకటేశ్వరరావు తమకు మొదటిరాత్రి జరగలేదని.. వధువు నిరాకరణకు కారణం తెలుసుకోవాలని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు.
ఇదే విషయమై మనస్తాపానికి గురైన సౌజన్య... గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుంది. సౌజన్య తలుపు తీయకపోవడంతో తలుపు పగులగొట్టిలోనికి వెళ్లిన కుటుంబ సభ్యులు.. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌజన్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. సౌజన్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.