హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొద్దిరోజుల క్రితం ఇల్లు మారారు. తన బ్రాడ్‌బాండ్ కనెన్షన్‌ను కొత్త చిరునామాకు మార్పించేందుకు కస్టమర్ కేర్ నంబర్ కోసం అంతర్జాలంలో వెతికారు. సైబర్ నేరస్థులు పొందుపరిచిన నంబరే సరైనది అనుకొని ఆ నంబరుకు ఫోన్ చేశారు. ఈక్రమంలో సైబర్ మోసగాళ్లు అతన్ని మాటల్లోకి దింపి యూపీఐ ఖాతా, డెబిట్ కార్డు వివరాలు తెలుసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్‌ను నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. ఆనంతరం అతడి పేరుతో బ్యాంకులో పది లక్షల ఇన్స్టంట్ రుణం మంజూరు చేయించి ఆ డబ్బును కొట్టేశారు. తన ప్రమేయం లేకుండానే ఖాతాలో అనూహ్యంగా డబ్బు జమ కావడం... వెంటనే మరో ఖాతాలోకి బదిలీ కావడం వల్ల బాధితుడు బ్యాంకును సంప్రదించగా మోసం బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పంథా మార్చారు..
సైబర్ నేరాల్లో ఆరితేరిన జంతార మోసగాళ్లు పంథా మార్చి తాజాగా ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్‌ను వినియోగించుకొని బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటి వరకు పేటీఎం, గూగుల్ పే తదితర ఈ-కామర్స్ చెల్లింపు వ్యవస్థలతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల కేవైసీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి యూపీఐ ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తెలుసుకునేవారు. అనంతరం చరవాణిలో ఎనీడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్ లాంటి యాప్‌ల్లో ఏదో ఒకదానిని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించేవారు. అలా చేస్తే బాధితుల చరవాణి రిమోట్‌ను నేరస్థులకు ఇచ్చినట్లే కావడం వల్ల అందులో జరిగే వ్యవహారాలన్నీ వారికి తెలిసిపోయేవి. అలా బాధితుల బ్యాంకు ఖాతా లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించేవారు. ఆనంతరం బాధితులకు వచ్చే ఓటీపీ నంబర్లను తెలుసుకొని డబ్బు కొట్టేసేవారు. ఇలా జరిగే ప్రతీ లావాదేవీకి బాధితుల నుంచి ఓటీపీ నంబరు తెలుసుకోవాల్సి వస్తుండటంతో తాజాగా కొత్త ఎత్తుగడలకు తెర తీశారు.