నగరంలో కొత్త రకం దొంగలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నారు. దండుపాళ్యం, చెడ్డీ గ్యాంగ్, ఖాకీ సినిమాలోని దొంగల ముఠాల్లాగా... వీరిదీ సరికొత్త శైలి చోరీ. వీరే... నేపాల్ దొంగలు. ఇప్పుడు వీరి దొంగతనాల ఛేదనలోనే పోలీసులు తలమునకలవుతున్నారు.
పనిలో చేరిన పక్షం రోజులకే...
రెండు నెలల క్రింత రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన చోరీ మరువక ముందే తాజాగా మరో ఘటన పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. రాయదుర్గం పోలీస్టేషన్ పరిధిలోని బీఎన్ఆర్ హిల్స్‌లో బోర్వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కి చెందిన నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నేపాల్‌కు చెందిన రాజేందర్ అలియాస్ రవి, అతని మేనకోడలు సీతతో పాటు మరొక ఇద్దరు కొంతకాలంగా మధుసూదన్ ఇంట్లో పని చేసే వారు. 15 రోజుల క్రితం జానకి, మనోజ్ కొత్తగా పనిలోకి చేరారు. నమ్మకంగా పని చేస్తూనే... ఇంట్లో డబ్బు, నగలపై కన్నేశారు. చోరీకి పథకం వేశారు. రాత్రి భోజనానికి వండిన పదార్థాలలో మత్తుమందు కలిపారు. అవి తిన్న మధుసూదన్ రెడ్డి, అతని కుమారుడు నితీశ్ రెడ్డి, కోడలు దీప్తి, మనుమడు అయాన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు.
మెలుకువ వచ్చాక చూస్తే...
మధూసూదన్ రెడ్డి భార్య రాత్రి చపాతి మాత్రమే తినటం వల్ల ఆమె సాధారణ నిద్రలోనే ఉన్నారు. పథకం ప్రకారం ఇంట్లో ఉన్న 15 లక్షల నగదుతో పాటు, దీప్తి మెడలో ఉన్న బంగారు గొలుసును సైతం ఎత్తుకెళ్ళారు. ఎలాంటి ఆధారం దొరకకుండా సీసీటీవీ కెమెరా డీవీఆర్‌ను, బాధితుల చరవాణులు ఎత్తుకెళ్ళారు. ఉదయం మేలుకువ వచ్చిన శైలజకు అనుమానం రాగా... పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధుసూదన్‌తో పాటు, కుమరుడు, కోడలు, మనుమడు వాంతులు చేసుకోవటం వల్ల కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు మాదాపూర్ ఇంఛార్జ్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద నిఘా పెట్టారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుల చరవాణులు శివారు ప్రాతంలో పడేసినట్లు సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. నిందితులు పరారవుతున్న సమయంలో స్థానికంగా పనిచేసే ఓ వాచ్మెన్ చూసినట్లు వివరించాడు.
ఒళ్లు గగ్గుర్పొడిచే నేపాల్ గ్యాంగ్ వ్యూహం...
అసలు నేపాల్ దొంగల ముఠా ఎలా చోరీలు చేస్తారు. ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు...? అన్న ప్రశ్నలకు సమాధానం ఇటీవల మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలోని వ్యాపారి నర్సింహా రెడ్డి ఇంట్లో ఆగస్టు 3న జరిగిన భారీ చోరి కేసు విషయంలో పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ నేపాల్'లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
విలాసవంతమైన ఇళ్లే లక్ష్యం...
నేపాల్‌లోని ఏడు ప్రావిన్సుల్లో సుదూర పశ్చిమ ప్రదేశ్ ఒకటి. ఈ ప్రావిన్స్‌లోని కైలాలీతో మరో మూడు, నాలుగు జిల్లాల్లో ఈ దొంగల ముఠాలుంటాయి. నలుగురైదుగురు కలిసి ముఠాగా ఏర్పడతారు. ముఠా సభ్యులు ఒక్కో నగరంలో ఒక్కో ఇంట్లో పనికి చేరతారు. వీరంతా ఫేస్బుక్ మెసెంజర్, వైబర్ తదితర సామాజిక మాధ్యమాల్లోనే మాట్లాడుకుంటారు. లూథియానా, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లోని విలాసవంతమైన ఇళ్లల్లో పనికి కుదురుతారు. నమ్మకంగా పనిచేస్తారు. కుటుంబ సభ్యులు, ఇంటికి సంబంధించిన సమాచారం సేకరిస్తారు.
అసలు దొంగ అప్పుడే దిగుతాడు...
అకస్మాత్తుగా పని మానేస్తారు. ఎందుకని యజమాని అడిగితే ఊర్లో అత్యవసర పని ఉందని, మళ్లీ తిరిగి రాలేనంటూ స్పష్టం చేస్తారు. మీకు ఇబ్బంది లేకుండా నా స్థానంలో మా బంధువును పనికి కుదుర్చుతానంటూ చెబుతాడు. ఆ పేరు మీద అసలు దొంగను రంగంలోకి దింపుతారు. ఇంట్లో అంతకు ముందు పని చేసిన ముఠా సభ్యుడు అసలు దొంగకు పూర్తి సమాచారమిస్తాడు. దాని ఆధారంగా ఆ దొంగ సందర్భం చూసి ఆహారంలో నిద్ర మాత్రలు కలుపుతాడు. కాళ్ళు చేతులు కట్టేసి బంగారు, వజ్రాభరణాలు, నగదును తీసుకుని ఉడాయిస్తారు. ఈ ఏడాది జనవరిలో కోకాపేట్లో ఇదే తరహాలో చోరీకి పాల్పడ్డారు. సైనిక్‌పురి కేసుతో పాటు, ఇప్పడు రాయదుర్గం కేసులోనూ ఇదే జరిగింది.
పోలీసులు చేరుకోలేని స్థలాల్లో ఇళ్లు...
ఒక్కసారి దొంగతనం చేసిన నగరంలో తిరిగి మరొకటి చేయకపోవటం వీరి ప్రత్యేకత. చోరీ తర్వాత ముఠా సభ్యులంతా సొత్తును సమంగా పంచుకుంటారు. బంగారు ఆభరణాలను ముక్కలుగా పగులగొడతారు. ఒక్కరు దొరికినా మిగిలిన వారు పట్టపడకుండా ఎవరి దారిన వాళ్లు నేపాల్‌కు చేరుకుంటారు. దొంగిలించిన సొత్తును చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ దొంగలకు రెండు ఇళ్ళుంటాయి. ఊరిలో ఒకటి, గుట్టలపై ఒకటి. పోలీసులు వచ్చినట్లు సమాచారం రాగానే గుట్టలపై ఉన్న ఇళ్లకు చేరుకుంటారు. అక్కడికి చేరుకోవాలంటే కనీసం 5 గంటల నుంచి 7 గంటల వరకు నడవాల్సి ఉంటుంది. పై నుంచి పోలీసుల రాకపోకల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు.
పట్టుకునేందుకు 'ఖాకీ'ల ప్రయత్నాలు...
రెండు నెలల క్రితం సైనిక్‌పురిలోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో రూ .2 కోట్ల వరకు విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇంట్లో పనికి కుదిరిన నేపాలీనే మరో నలుగురితో కలిసి చోరికి పాల్పడినట్లు తేల్చారు. ముంబయి నుంచి బస్సులో నేపాల్‌కు పారిపోయినట్లు గుర్తించారు. ఈ ముఠా కూడా ఇదే తరహాలో వెళ్ళి ఉంటుందని రాయదుర్గం పోలీసులు భావిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారు.