నర్సాపూర్ లంచం కేసులో అదనపు కలెక్టర్ నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. నగేష్‌తో పాటు ఆయన బినామీ జీవన్ గౌడ్‌ను అధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా అదనపు కలెక్టర్ నగేష్‌తో పాటు ఆర్డీవో అరుణ రెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీమ్, జీవన్ గౌడ్‌ను అనిశా అధికారులు రెండోరోజు ప్రశ్నిస్తున్నారు.
రూ.40 లక్షలు ఎక్కడ..?
బాధితుడు లింగమూర్తి నుంచి తీసుకున్న రూ.40 లక్షలను ఎక్కడ ఉంచారని అవినీతి నిరోధక శాఖ అధికారులు నగేష్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. నగేష్ తన బినామీ జీవన్ గౌడ్‌తో ఎక్కడెక్కడ వ్యవహారాలు నడిపాడని అధికారులు ఆరా తీస్తున్నారు. కొంపల్లిలోని నగేష్ ఇంట్లో దొరికిన లాకర్ బోయిన్పల్లి ఆంధ్ర బ్యాంకులో ఉన్నట్లు గుర్తించి దానికి సంబంధించిన వివరాలను ప్రశ్నించారు.