గుప్తనిధుల కోసం దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసే ముఠాను ఆంధ్రప్రదేశ్లో నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారి డీఐజీ అశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మూఢనమ్మకాలతో పురాతన ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మక్కపేటలో అపహరణ వీరి పనే...
వత్సవాయి మండలం మక్కపేటలో ఉన్న అతి పురాతనమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో.. గతేడాది సెప్టెంబర్ 16న నంది విగ్రహం చెవులను ఈ గ్యాంగ్ అపహరించి ఎర్రగట్టు తీసుకెళ్లారని ఎస్పీ తెలిపారు. చెవిలో వజ్రాలు ఉన్నాయని భావించిన నిందితులు వాటిని పగలగొట్టి చూశారని.. వాటిలో ఏమీ లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిపారు. ఈ విగ్రహాన్ని తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఏడుగురుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.