ఏకంగా పోలీసుల పేరుతోనే నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి, నగదు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను నల్గొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాష్ట్రానికి చెందిన 81 మంది సహా హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో 350 మంది పోలీసుల పేరుతో వీరు నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ముఠా గుట్టురట్టు...
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన ఈ ముఠాలో ఒకరు మైనర్ కావడంతో మిగిలిన ముగ్గురు నిందితులను ఎస్పీ ఏవీ రంగనాథ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. భరత్‌పూర్ జిల్లా కేత్వాడ మండలానికి చెందిన ముస్తఖీమ్‌ఖాన్, షాహిద్, సద్దాంఖాన్, ఓ మైనర్ బాలుడు నాలుగు నెలల నుంచి ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
నల్గొండ ఎస్పీ పేరుతోనూ ఫేక్ ఐడీ...
ఫేస్‌బుక్‌లో పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. వారి స్నేహితుల జాబితాలో ఉన్నవారికి రిక్వెస్ట్‌లు పెట్టి అత్యవసరం పేరుతో డబ్బు పంపాలని మోసాలకు పాల్పడుతున్నారు. నల్గొండ ఎస్పీ పేరుతోనూ నకిలీ ఖాతా సృష్టించారు.
రంగంలోకి ప్రత్యేక బృందం..
ఈ ముఠాను పట్టుకోవడానికి నలుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని రాజస్థాన్‌కు పంపారు. మెసెంజర్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా అక్కడి పోలీసుల సహాయంతో నలుగురు నిందితులను పట్టుకొని నల్గొండకు తీసుకొచ్చారు. వీరి నుంచి రూ.లక్ష నగదు, 8 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్, 30 సిమ్‌కార్డులు, నకిలీ ఆధార్‌కార్డులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.