తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కుప్పకూలిన కుమారుడు.. కొద్ది గంటల్లోనే తల్లి మృతి - కరోనా తాజా వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా కుమారుడు, అవే లక్షణాలతో అతని తల్లి గంటల వ్యవధిలో ఇంట్లోనే, కుటుంబ సభ్యులు చూస్తుండగానే కన్నుమూసిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పురపాలిక పరిధి మంగల్‌పేటలో జరిగింది.

Mother son dies with corona at sanagareddy district
కూర్చున్నచోటే కుప్పకూలిన కుమారుడు.. కొద్ది గంటల్లోనే తల్లి మృతి

By

Published : Aug 14, 2020, 9:41 AM IST

నారాయణఖేడ్‌ మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన వ్యక్తి మంగల్‌పేటలో కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు(32) ఖేడ్‌లో ఓ దుకాణం నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కన్పించడంతో అతను, అతని భార్య, తల్లి మంగళవారం యాంటిజెన్‌ పరీక్షలు చేయించుకున్నారు. భార్యాభర్తలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తల్లికి నెగెటివ్‌ వచ్చింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సూచన మేరకు ముగ్గురూ హోంఐసొలేషన్‌లో ఉన్నారు. బుధవారం అదే కుటుంబంలో మరికొందరికి లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేయించుకున్నారు. మరో నలుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. వాళ్లూ ఇంట్లోనే ఉంటున్నారు. దుకాణం నిర్వహిస్తున్న యువకుడు బుధవారం అర్ధరాత్రి దాటాక శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొన్నారు. కాసేపటికే సోఫాలో కూర్చున్న చోటే మృతి చెందారు. అవే లక్షణాలతో గురువారం ఉదయం అతని తల్లి(68) కూడా ప్రాణాలు విడిచారు. ‘‘ఇంట్లో ఏడుగురికి కరోనా వచ్చింది. అందర్నీ హోంఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించిన వైద్యులు ఎలాంటి మందులూ ఇవ్వలేదు. స్థానిక మందుల దుకాణంలో గోలీలు కొనుక్కున్నాం. బుధవారం అర్ధరాత్రి మా తమ్ముడు, అమ్మ శ్వాసతీసుకోవడానికి ఇబ్బందులుపడ్డారు. మందుల కోసం ప్రయత్నించాం. అన్ని దుకాణాలు మూసి ఉండటంతో నిస్సహాయంగా ఉండిపోయాం. చూస్తుండగానే సోదరుడు, తర్వాత కొద్ది గంటల్లోనే అమ్మ చనిపోయారు’’ అని మృతుని సోదరుడు కన్నీటిపర్యంతమయ్యారు.

అంత్యక్రియలకు అడ్డుచెప్పిన తండావాసులు

మృతులకు స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపించేందుకు తండావాసులు అంగీకరించలేదు. స్థానిక తహసీల్దారు పర్యవేక్షణలో మంగల్‌పేట శివారులోని ప్రభుత్వ భూమిలో దహనక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి-నిఘా నీడలో: స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ఠ భద్రత

ABOUT THE AUTHOR

...view details