భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపంతో బిడ్డలతో కలిసి ఇల్లు వదిలిన తల్లి చెరువు వద్దకు చేరింది. పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి.. ఆపై చెరువులో తోసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. జోగులాంబ గద్వాల జిల్లా కాలూరు తిమ్మన్‌దొడ్డి మండలం మల్లాపురంలో చోటుచేసుకున్న ఘటన గ్రామస్థులను కలచివేసింది. మల్లాపురం గ్రామానికి చెందిన చిన్నకంబయ్య అలియాస్ బాషా, సత్తెమ్మ (28) దంపతులు తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకోవడంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు.
ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి - మల్లాపురంలో విషాదం
జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు కూతుళ్లు చెరువులోకి తోసి తాను ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
భర్త సరిగా పనికి వెళ్లడం లేదనే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం ఉదయం భర్త పొలానికి రమ్మని పిలవగా, భార్య నిరాకరించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం భాషా ఏడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని పొలానికి వెళ్లాడు. తర్వాత కొద్దిసేపటికే సత్తెమ్మ కుమార్తెలు నందిని (10), శివాని (3), బుజ్జి (11 నెలలు)లతో కలిసి బయటకు వెళ్లింది. చుట్టుపక్కలవారికి పొలం వద్దకు వెళ్తున్నట్టు చెప్పింది. నేరుగా గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లింది. మధ్యాహ్నం అక్కడి తూము వద్ద తల్లి బిడ్డలకు భోజనం తినిపిస్తుండడాన్ని గ్రామస్థులు కొందరు గమనించారు. సాయంత్రం 3 గంటల సమయంలో చెరువులో నాలుగు మృతదేహాలను స్థానిక రైతులు గుర్తించారు. మృతదేహాలను ఇంటికి చేర్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.