మెదక్ జిల్లా కేంద్రంలోని కుమ్మరిగల్లికి చెందిన రవి.. నిజాంపేట మండలం తిప్పనగుల్లాకు చెందిన అనూషను ఆరేళ్ల క్రితం వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈనెల 10న భర్తతో గొడవపడిన అనూష తన చిన్న కుమార్తె ప్రణవి(17 నెలలు)ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదని తెలుసుకున్న అనూష తల్లిదండ్రులు అక్టోబర్ 11న మెదక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం చెత్త సేకరించడానికి వెళ్లిన పారిశుద్ధ్య కార్మికునికి స్థానిక పిట్లం చెరువులో మహిళ మృతదేహం కనిపించగా.. పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ వెంకటయ్య అనిల్ కుమార్ ఆధ్వర్యంలో.. ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా అనూష, ప్రణవిల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈనెల 10న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. తమ కుమార్తె, మనుమరాలు మృతికి అత్తింటి వేధింపులే కారణమని అనూష తల్లి శాంతమ్మ ఆరోపించారు.